రెండేళ్లలో సోలార్ పార్కులు | solar parks in two years | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో సోలార్ పార్కులు

Published Sat, May 3 2014 1:41 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

రెండేళ్లలో సోలార్ పార్కులు - Sakshi

రెండేళ్లలో సోలార్ పార్కులు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20-25 సోలార్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రేస్ పవర్ ఇన్‌ఫ్రా ప్రకటించింది. రేస్ పవర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మొత్తం 70 మెగా వాట్ల సామర్థ్యంతో నాలుగు సోలార్ పార్కులను కలిగి వుంది. దేశవ్యాప్తంగా  ప్రైవేటు రంగంలో నాలుగు సోలార్ పార్కులను తమ సంస్థ మాత్రమే కలిగి వుందని, రానున్న కాలంలో ఈ సంఖ్యను 25కి పెంచాలన్నది లక్ష్యమని రేస్ పవర్ ఇన్ ఫ్రా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సంజయ్ గుప్తా తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెరుగుతోందని, దీనికితోడు కంపెనీలు సామాజిక సేవలో (సీఎస్‌ఆర్) భాగంగా సౌర ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ విస్తరణ కార్యక్రమాలు, ఈ రంగంలో ఉన్న అవకాశాలను గుప్తా ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు.

 మెగావాట్‌కు రూ.6.8 కోట్లు
 సోలార్ పార్కులను అభివృద్ధి చేసి వివిధ కంపెనీలకు, సంస్థలకు కావాల్సిన మెగా వాట్ల మేరకు విక్రయిస్తున్నట్లు గుప్తా తెలిపారు. ఈపీసీ విధానంలో ఇప్పటి వరకు 70 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పార్కులను అభివృద్ధి చేయగా మరో 70 మెగా వాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి.  5-50 మెగావాట్ల సామర్థ్యంతో పార్కులను ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్థల సేకరణ దగ్గర నుంచి గ్రిడ్ అనుసంధానం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తామే నిర్వహిస్తామన్నారు.

ఒక్క మెగావాట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు రూ.6.8 కోట్లు వ్యయం అవుతుందన్నారు. ఇప్పటికే హెచ్‌ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి వివిధ ఎంఎన్‌సీలు తమ సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే కంపెనీల సాంఘిక సేవలో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టిసారిస్తున్నాయని, ఆ విధంగా పలు ఐటీ సెజ్‌లు, ఫైవ్‌స్టార్ హోటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు గుప్తా తెలిపారు. కంపెనీలను ఆకర్షించడానికి యూనిట్ ధరపై డిస్కౌంట్లను కూడా అందిస్తున్నట్లు తెలిపారు.

 రాష్ట్ర పాలసీనే బెస్ట్
 సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం మిగిలిన రాష్ట్రాల కంటే చాలా బాగుందని, దీన్ని కొనసాగించాలని గుప్తా కోరారు. రాజస్థాన్, గుజరాత్‌లో ప్రైవేటు కంపెనీలకు విక్రయించుకునే విధంగా ఓపెన్ పాలసీ లేకపోవడం ప్రధాన లోపం. అలాగే నెట్ మీటరింగ్ పేరుతో సొంత అవసరాలకు సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. నెట్ మీటరింగ్ విధానంలో 10 నుంచి 50 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను 5 సంస్థలకు ఏర్పాటు చేస్తున్నాం. ఇక రేడియేషన్ విషయానికి వస్తే రాజస్థాన్‌తో పోలిస్తే తక్కువ రేడియేషన్ వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతున్నప్పటికీ వ్యయాలను నియంత్రించుకోవడం ద్వారా ఆ నష్టాలను భర్తీ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంతం సోలార్ విద్యుత్‌కు అనువైనది కాదని, తెలంగాణ, రాయలసీమలోని అనంతపురం జిల్లాలు అనువుగా ఉన్నాయన్నారు.

 రూ.1,000 కోట్ల టర్నోవర్
 గతేడాది రూ.200 కోట్లుగా ఉన్న వ్యాపార పరిమాణం ఈ ఏడాది రూ.400 కోట్లు దాటుతుందని, 2016కల్లా రూ.1,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాపార విస్తరణకు కావల్సిన నిధులను అంతర్గతంగా సమకూర్చుకుంటున్నామని, పీఈ పెట్టుబడులు, రుణాల ద్వారా నిధులు సేకరించే యోచన లేదని గుప్తా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement