ఆ ‘టచ్’... మాకొదిలేయండి! | Specialization in touch with the customer service nolariti | Sakshi
Sakshi News home page

ఆ ‘టచ్’... మాకొదిలేయండి!

Published Sat, Aug 8 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

ఆ ‘టచ్’... మాకొదిలేయండి!

ఆ ‘టచ్’... మాకొదిలేయండి!

కస్టమర్లతో టచ్‌లో ఉండే సేవలే నొలారిటీ  ప్రత్యేకత
♦ రూ.10 లక్షల పెట్టుబడితో ఆరంభమై... అంతర్జాతీయ స్థాయికి...
♦ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో అధికం దీని కస్టమర్లే
♦ మూడేళ్లలో బిలియన్ డాలర్ల సంస్థగా మారాలని లక్ష్యం
♦ ఇప్పటికే 24.5 మిలియన్ డాలర్ల సమీకరణ
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కస్టమర్లను ప్రసన్నం చేసుకోవటానికి వారితో ఆత్మీయంగా మాట్లాడటమనేది మునుపటి పద్ధతి. మరి, ఇప్పటి ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇది సాధ్యమా? ఔనంటోంది నొలారిటీ క్లౌడ్ కమ్యూనికేషన్. ఎందుకంటే కంపెనీల తరఫున కస్టమర్లతో ప్రతి సందర్భంలోనూ టచ్‌లో ఉండే పనిని ఈ సంస్థే చేస్తోందిపుడు. వారి సెల్‌ఫోన్లకు నేరుగా గ్రీటింగ్ మెసేజ్‌లు.. వెల్‌కం ఎస్‌ఎంఎస్‌లు పంపటం, అప్పుడప్పుడు వారికి కాల్ చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకోవటమే కాదు, ఇంకా చాలా పనులు చేస్తోంది. అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నొలారిటీ కథ ఇదిగో...

 అంబరీష్ గుప్తా ఐఐటీ కాన్పూర్‌లో డిగ్రీ పూర్తి చేశాక.. సిలికాన్‌వ్యాలీలోని ఓ ఐటీ కంపెనీలో మూడేళ్లు పనిచేశారు. 2004లో ఇండియాకి తిరిగొచ్చి ‘ఇన్‌వెంటికా’ పేరుతో ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించారు. ఆఫ్‌లైన్‌లోనే కష్టంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో చేయటమంటే మాటలు కాదన్న విషయం తెలియడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. ఆ వ్యాపారం పోతేపోయింది. కానీ గుప్తాకు అక్కడొక ముఖ్యమైన విషయం తెలిసింది. అదేంటంటే.. వ్యాపారంలో కస్టమర్లకు, కంపెనీలకు ఉండే అనుబంధం. మరి ప్రతి ఒక్క కస్టమర్‌ను గుర్తుపెట్టుకుంటూ.. సరైన సమయంలో సరైన విధంగా రెస్పాండ్ కావాల్సిన అవసరమూ తెలిసొచ్చింది.

ఇదంతా టెక్నాలజీతోనే సాధ్యమని భావించిన గుప్తా... మళ్లీ అమెరికా వెళ్లి ఎంబీఏలో చేరారు. చదువుతూనే క్లౌడ్ టెక్నాలజీని శోధించారు. కొన్ని జాబ్ పోర్టల్ సంస్థల దగ్గరికెళ్లి వాళ్ల ఫోన్ నంబర్లు తీసుకొని... ఎలాంటి హార్డ్‌వేర్ సపోర్ట్ లేకుండా క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వెల్‌కం మెసేజ్‌లు పంపించేవారు గుప్తా. వాళ్లేమో ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోయేవారు. దీన్నెందుకు కస్టమర్లకు మళ్లించకూడదనే ఆలోచన అక్కడే పుట్టింది. అదిగో... 2009లో నొలారిటీ క్లౌడ్ కమ్యూనికేషన్ పుట్టింది అలాగే.

 నొలారిటీ కూడా మీ కంపెనీ ఉద్యోగే..
 నొలారిటీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. వెబ్ అప్లికేషన్‌కు, కాలర్‌కు మధ్య అనుసంధానకర్త. అంటే కంపెనీకి వచ్చే ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, సోషల్ వెబ్‌సైట్లలో లైకులు, పోస్టులు, కామెంట్లు.. ఇలా ప్రతి దాన్నీ తీసుకొని సంబంధిత మార్కెటింగ్, సేల్స్ వంటి సంబంధిత విభాగానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నొలారిటీ కూడా మీ కంపెనీ ప్రతినిదే. కాకపోతే ఇది పూర్తిగా క్లౌడ్‌లో పనిచేసే వర్చుకల్ కమ్యూనికేషన్. గంటకు 10 లక్షల ఫోన్ కాల్స్‌ను ప్రాసెస్ చేయడం  నొలారిటీ ప్రత్యేకత.

 రాజకీయ పార్టీలూ కస్టమర్లే..
 ఈ-కామర్స్, రియల్టీ, ట్రావెల్, ఎడ్యుకేషన్ ఇలా 20 రంగాలకు చెందిన 65 దేశాల్లోని 12 వేలకు పైగా కంపెనీలు నొలారిటీ క్లౌడ్ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 100కు పైగా కంపెనీలూ దీని కస్టమర్లే. ఇండియాతో పాటు ఆఫ్రికా, దుబాయ్, సింగపూర్, ఫిలిప్పీన్స్, టర్కీ, మలేషియా దేశాలు... హెచ్‌యూఎల్, లాక్మే, మహింద్రా హాలిడేస్, ఎల్‌అండ్‌టీ, ఏసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్, ట్వీటర్, కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ వంటి బడా కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. నొలారిటీ సేవల్ని దేశంలోని పలు రాజకీయ పార్టీలూ వినియోగించుకుంటున్నాయి. ఢిల్లీ, ఒడిశా  అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బిజూ జనతాదళ్ పార్టీలు ఓటర్లకు ఎస్‌ఎంఎస్ రూపంలో క్యాంపెయినింగ్ చేశాయి.

 రెండేళ్లలో భారీగా విస్తరణ..: రూ.10 లక్షల సొంత పెట్టుబడితో ప్రారంభమైన నొలారిటీ ఇప్పటివరకు 24.5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.  ఏటా కంపెనీ వార్షిక టర్నోవర్ రెండింతలవుతోంది. 2017 ముగింపు నాటికి బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాలన్నది కంపెనీ లక్ష్యం. కంపెనీలో 550 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ మిస్డ్ డయల్, వర్చువల్ యాడ్ నంబర్, క్లిక్ 2 కాల్, సూపర్ టోల్ ఫ్రీ నంబర్, క్లౌడ్ ఐవీఆర్ వంటి ఎన్నో రకాల క్లౌడ్ సేవలందిస్తోంది. వీటిలో సూపర్ రిసెప్షనిస్ట్, స్మార్ట్ ఐవీఆర్, సూపర్ కాన్ఫరెన్స్ ప్రధాన సేవలు.  
 
 ఇదీ... మా ప్రత్యేకత
 ఇటీవలే స్పీచ్ రికగ్నేషన్ టెక్నాలజీ సేవల్ని ప్రారంభించాం. దీంతో.. కంపెనీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి ఆడా? మగా? వయసెంత? తన మూడ్ ఎలా ఉంది? వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. అవన్నీ సంబంధిత యాజమాన్యానికి క్షణాల్లో చెప్పేస్తాం. ఆరు నెలల్లో వీడియో టెక్నాలజీ సేవల్ని తేబోతున్నాం. సింగపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నొలారిటీకి విదేశాలతో పాటు దేశంలో గుర్గావ్, ముంబై, బెంగళూరుల్లో ఆఫీసులున్నాయి. రెండేళ్లలో 30-40 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశ, విదేశాల్లో విస్తరించనున్నాం. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తాం. చైనా, ఆఫ్రికా, టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయిల్, ఈజిప్ట్ దేశాల్లోనూ విస్తరించనున్నాం.
 - ‘సాక్షి’తో అంబరీష్ గుప్తా, సీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement