పీఏసీఎల్ ఆస్తులతో లావాదేవీలొద్దు
జస్టిస్ లోధా కమిటీ హెచ్చరిక
న్యూఢిల్లీ: పీఏసీఎల్ కంపెనీ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపరాదని జస్టిస్ ఆర్.ఎం. లోధా అథ్యక్షతన గల కమిటీ హెచ్చరించింది. పీఏసీఎల్ గ్రూప్ కంపెనీల, అనుబంధ కంపెనీల సంబంధిత ఆస్తులను, కొనుగోలు చేయడం విక్రయించడం, మరే ఇతర తరహా లావాదేవీలనైనా నిర్వహించడం చేయరాదని ఈ కమిటీ పేర్కొంది. ఇలాంటి లావాదేవీలను నిర్వహిస్తే, అది చట్టవిరుద్ధమైనదిగా భావించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ కమిటీ హెచ్చరించింది. పీఏసీఎల్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ విధమైన హెచ్చరికలు జారీ చేస్తున్నామని వివరించింది.
ఎవరి సొమ్ములు వారికివ్వడానికే...: పీఏసీఎల్ సంస్థ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులను సమీకరించింది. 18 ఏళ్లుగా ఈ కంపెనీ అక్రమ పద్ధతుల్లో ప్రజల నుంచి రూ.49,000 కోట్లు సమీకరించిందని సెబీ గుర్తించింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఇన్వెస్టర్లకు వారి సొమ్ములను వారికి తిరిగి చెల్లించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇన్వెస్టర్లకు వారి డబ్బులు వారికి చెల్లించే ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ పీఏసీఎల్ ఆస్తులను విక్రయించే ప్రక్రియను నిర్వహిస్తోంది.