
అంతర్జాతీయ సంకేతాలు, పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ఈ వారం వెలువడే కంపెనీల క్యూ3 ఫలితాలు కూడా ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. మహా శివరాత్రి సందర్భంగా రేపు(మంగళవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది.
గణాంకాలు...
నేడు(సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి. ఇదే రోజు డిసెంబర్ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా వస్తాయి. గత ఏడాది డిసెంబర్లో సీపీఐ ద్రవ్యోల్బణం 5.21 శాతానికి పెరిగింది. గత ఏడాది నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 8.4 శాతానికి ఎగసింది. ఈ నెల 14న(బుధవారం) జనవరి టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం వెల్లడిస్తుంది. గత ఏడాది డిసెంబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 3.58 శాతంగా నమోదైంది.
నేడు గెయిల్ ఫలితాలు...
నేడు(సోమవారం) గెయల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్‌లు క్యూ3 ఫలితాలను వెల్లడిస్తాయి. ఇంకా ఈ వారంలో ఎన్‌బీసీసీ(ఇండియా), ఎన్‌ఎమ్‌డీసీ, గోద్రేజ్ ఇండ్రస్టీస్, గ్రాసిమ్, జెట్ ఎయిర్‌వేస్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, టాటా పవర్ తదితర కంపెనీల ఫలితాలు వస్తాయి.
సెంటిమెంట్‌పై ‘ప్రపంచ’ ప్రభావం..
కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించుతున్నాయని, కంపెనీలు కోలుకుంటున్నాయనడానికి ఇది నిదర్శనమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే ప్రపంచ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న ఒడిదుడుకులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని వివరించారు. ఈ వారంలో వచ్చే పారిశ్రామికోత్పత్తి, రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకమని పేర్కొన్నారు.
అంతర్జాతీయ సంకేతాలకనుగుణంగానే గత వారం మన మార్కెట్ కదలికలున్నాయని, ఈ వారం కూడా ఇదే కొనసాగుతుందని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఇక అంతర్జాతీయ పరంగా చూస్తే, ఈ నెల 13న(మంగళవారం) జపాన్ క్యూ4 జీడీపీ గణాంకాలు వస్తాయి. బుధవారం(ఈ నెల14న) అమెరికా జనవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, అదే రోజు అమె రికా ముడి చమురు నిల్వల గణాంకాలు వస్తాయి.
ఆస్టర్ హెల్త్‌కేర్ ఐపీఓ నేటి నుంచి
హెల్త్‌కేర్ సర్వీసుందించే ఆస్టర్ డీఎమ్ హెల్త్‌కేర్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి (సోమవారం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 15న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను రూ.180–190 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.980 కోట్ల వరకూ సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. కనీసం 78 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 26న ఈ కంపెనీ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంది.
ఏడు రోజుల్లో రూ.3,800 కోట్లు వెనక్కి
గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి రూ.3,838 కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే డెట్‌మార్కెట్లో మాత్రం రూ.4,600 కోట్లు పెట్టుబడలు పెట్టారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లో భారీ పతనం చోటు చేసుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో ఈక్విటీల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment