
స్టాక్ సూచీలు అక్కడక్కడే..
ఉత్తేజాన్నివ్వని ఆర్‌బీఐ పాలసీ
24 పాయింట్ల లాభంతో 26,169కు సెన్సెక్స్
20 పాయింట్ల లాభంతో 7,955కు నిఫ్టీ
ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్ స్వల్పలాభాల్లో ముగిసింది. కీలక రేట్లలో యథాతథ స్థితిని ఆర్‌బీఐ కొనసాగించడంతో స్టాక్ మార్కెట్ స్తబ్దంగా ట్రేడయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 24 పాయింట్లు లాభపడి 26,169 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 7,955 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. లోహ, ఎఫ్‌ఎంసీజీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్ల నుంచి సెన్సెక్స్‌కు మద్దతు లభించింది. నవంబర్ వాహన విక్రయాలు అంచనాలను అందుకోలేకపోవడంతో సోమవారం లాభపడిన వాహన షేర్లు మంగళవారం నష్టపోయాయి.
లాభాల్లో ప్రారంభయినా...:
అందరూ ఊహించనట్లుగానే ఆర్‌బీఐ కీలక రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించింది. అయితే అవసరమైనప్పుడు రేట్ల కోతకు సిద్ధమేనని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సంకేతాలివ్వడం, రూపాయి బలపడడం, జీడీపీ క్యూ2 వృద్ధి రేటు 7.4 శాతం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. అయితే హెచ్‌ఎస్‌బీసీ తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ బలహీనంగా ఉండడం, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ప్రతికూల ప్రభావం చూపించాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధరలు పెరుగుతుండటంతో హిందాల్కో, వేదాంత, కోల్ ఇండియా, టాటా స్టీల్ కంపెనీల షేర్లు 3-5 శాతం వరకూ లాభపడ్డాయి.
మార్కెట్ డేటా...
టర్నోవర్ (రూ.కోట్లలో)
బీఎస్‌ఈ 2,992
ఎన్‌ఎస్‌ఈ (ఈక్విటీ విభాగం) 16,258
ఎన్‌ఎస్‌ఈ(డెరివేటివ్స్) 1,39,954
నికర అమ్మకాలు/కొనుగోళ్లు (రూ.కోట్లలో)
ఎఫ్‌ఐఐ -107
డీఐఐ 195