
బ్యాంక్, వాహన, లోహ షేర్ల దన్నుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్ల లాభాల జోరు సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 125 పాయింట్లు పెరిగి 37,271 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11,036 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా మూడో రోజుల పాటు లాభపడగా, నిఫ్టీ వరుసగా ఐదో రోజూ లాభపడింది. ముడి చమురు ధరలు 0.8% పెరగడం,రూపాయి మారకం విలువ 2 పైసలే పుంజుకోవడం, ట్రేడింగ్ చివర్లో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడం వల్ల లాభాలు పరిమితమయ్యాయి. అన్ని రంగాల బీఎస్‌ఈ సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
రోజంతా లాభాలే..: మొహర్రం సందర్భంగా మంగళవారం సెలవు కావడంతో ఒక రోజు విరామం తర్వాత స్టాక్ మార్కెట్ లాభాల్లో ఆరంభమయ్యాయి. ఆరి్థక మందగమనాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనున్నదనే అంచనాలతో రోజంతా లాభాలు కొనసాగాయి. మరోవైపు వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య ఒప్పందం కుదరగలదన్న ఆశలతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం కలసివచి్చంది. ఆంక్షల విధింపు నుంచి 16 కేటగిరీల వస్తువులను చైనా మినహాయించడం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచి్చంది.
వాహన షేర్ల జోరు: వాహనాలపై జీఎస్‌టీని కేంద్రం తగ్గించగలదన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. వాహన కంపెనీలు వాహనాల తయారీకి స్టీల్, అల్యూమినియమ్ లోహాలను ఉపయోగిస్తాయి కాబట్టి, లోహ షేర్లు కూడా మెరిశాయి. ఐషర్ మోటార్స్ 5%, మారుతీ సుజుకీ 4%, మదర్సన్ సుమి 4%, టీవీస్‌మోటార్ 3.6% మేర పెరిగాయి.
యస్ బ్యాంక్: పేటీఎంకు ప్రమోటర్ రాణాకపూర్ వాటా విక్రయం వార్తలతో షేర్ ఇంట్రాడేలో 16 శాతం పెరిగింది. చివరకు 13 శాతం లాభంతో రూ.71.60 వద్ద ముగిసింది.
ఈ నెలలో ఎఫ్‌పీఐల తొలి కొనుగోళ్లు
సూపర్ రిచ్ సర్‌చార్జీ తొలగించినప్పటికీ,మార్కెట్లో అమ్మకాలు ఆపని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో తొలిసారి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. బుధవారం రూ.267 కోట్ల నికర కొనుగోలు జరిపారు. ఈ నెలారంభంలో రూ.2,016 కోట్లుగా ఉన్న వీరి నికర అమ్మకాలు 9వ తేదీ నాటికి రూ.188 కోట్లకు తగ్గాయి.