
సాక్షి, ముంబై : స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ట్రేడింగ్ ఆరంభం నుంచి నెగిటివ్ సెంటిమెంట్‌తో నీరసపడిన కీలక సూచీలు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్ల ఆందోళన నేపథ్యంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనమైంది. ఒక దశలో 420 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 38వేల కీలక మద్దతు స్థాయి దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 122 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టంలోనే 37,971 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 138 పాయింట్ల నష్టంలో 11,450 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకుల సూచీ రెండు శాతం దాకా నష్టపోగా, ఫార్మా, రియాల్టి, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఒక శాతంపైగా నష్టపోయాయి.
ముఖ్యంగా రూపీ అత్యంత కనిష్టానికి చేరడంతో మిడ్ సెషన్‌కి మార్కెట్లు 1 శాతం మేర నష్టాల్లోకి చేరుకున్నాయి. గత ముగింపుతో పోల్చితే డాలరుతో దేశీయ కరెన్సీ రూపాయి ఏకంగా 91 పైసలు క్షీణతను నమోదుచేసి 73 స్థాయి పతనానికి చేరువలో ఉంది. సన్ ఫార్మా, రెడ్డీ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు టాప్ లూజర్స్‌గా ఉండగా, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, విప్రో, ఇన్ఫోసిస్, లుపిన్, యాక్సిస్ బ్యాంక్‌లు టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి.