
ముంబై /న్యూయార్క్: డాలర్ బలహీనత, అణ్వాయుధాలపై చర్చలకు ఉత్తరకొరియా ససేమిరా అనటం వంటి అంశాలు 17వ తేదీతో ముగిసిన వారంలో పసిడికి బలాన్నిచ్చాయి. అంతర్జాతీయ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 20 డాలర్లు పెరిగి 1,294 డాలర్లకు ఎగసింది. పసిడి పురోగతి బాట ఇది వరుసగా రెండవవారం. ఈ రెండు వారాల్లో డాలర్ ఇండెక్స్ సైతం దాదాపు డాలర్ పడిపోయి 93.61కి చేరింది.
అమెరికా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ఉత్తరకొరియా సహా ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం పసిడిది బులిష్ ధోరణే అన్న అంచనాలకు బలాన్ని ఇస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పన్నులకు సంబంధించి అమెరికా తీసుకునే చర్యలు పసిడి కదలికలను నిర్దేశించే అంశాల్లో ముఖ్యమైనవి. 1,310 డాలర్లు, 1,325 డాలర్లు పసిడికి కీలకమనీ, ఈ నిరోధాన్ని దాటితే తిరిగి యల్లో మెటల్ పూర్తి బులిష్ జోన్‌లోకి వచ్చినట్లేనని వారు పేర్కొంటున్నారు. ఇక దిగువస్థాయిలో 1,250 డాలర్లు పసిడి బలమైన మద్దతని కూడా వారి అభిప్రాయం. వచ్చే కొద్ది గంటల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరగనున్న గోల్డ్ అండ్ సిల్వర్ సదస్సు ఈ మెటల్‌కు సంబంధించిన కీలక అంశాల్లో ఒకటి.
దేశీయంగా రూపాయి అడ్డు...
అంతర్జాతీయంగా పసిడి ధర పెరిగినప్పటికీ, దేశంలో ఆ ప్రభావం పెద్దగా లేదు. డాలర్ మారకం విలువలో రూపాయి బలోపేతం కావటం దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే వారంలో 20 పైసలు బలపడి రూపాయి 65.01 వద్ద ముగిసింది.
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో వారం మొత్తంమీద పసిడి ధర కేవలం రూ.100 పెరిగి రూ.29,690 వద్ద ముగిసింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్‌లో వారం వారీగా ధర స్వల్పంగా రూ.60 తగ్గింది. 99.9 స్వచ్ఛత రూ.60 తగ్గి రూ. 29,610 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో పడిపోయి రూ.29,460కి పడింది. ఇక వెండి ధర కేజీకి స్వల్పంగా రూ. 45 ఎగసి రూ. 39,590 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment