పాత నోట్లు ఎన్ని వచ్చాయ్..
నగదు విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు ఎప్పుడు ఎత్తేస్తారు...
• ఎప్పటికల్లా పరిస్థితి చక్కబడుతుంది...
• పెద్ద నోట్ల రద్దుపై ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం
• సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయిన ఉర్జిత్
• మరో దఫా ప్రశ్నించనున్న కమిటీ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అంశంపై వివరణనిచ్చేందుకు పార్లమెంటు స్థాయీ సంఘం ముందు బుధవారం హాజరైన ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ‘నగదు విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలెప్పుడు ఎత్తివేస్తారు? అసలు మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయి? పెద్ద నోట్ల రద్దు తర్వాత అసలెంత మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చింది? కచ్చితమైన లెక్కలు చెప్పండి‘ అంటూ కమిటీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. అయితే, కమిటీ సభ్యులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సంతృప్తికరమైన జవాబులు ఇవ్వలేకపోయారు. డీమోనిటైజేషన్ దరిమిలా 60 శాతం దాకా కొత్త కరెన్సీని వ్యవస్థలోకి తెచ్చామని తెలిపినా .. పరిస్థితులు మళ్లీ ఎప్పటికల్లా సాధారణ స్థితికి వస్తాయో చెప్పలేకపోయారు.
డీమోనిటైజేషన్ అనంతరం ఎన్ని పాత రూ. 500, రూ. 1,000 నోట్లు తిరిగి వచ్చాయన్నది కూడా ఆయన కచ్చితంగా చెప్పలేకపోయారు. దీంతో కమిటీ సభ్యులు ఆర్‌బీఐని, ఆర్థిక శాఖ అధికారులను మరో దఫా ప్రశ్నించాలని నిర్ణయించారు. ‘ఆయన (పటేల్) ప్రధాన ప్రశ్నలకు సమాధానమివ్వలేకపోయారు. కొంత వరకే చెప్పగలిగారు. వ్యవస్థలోకి ఎంత నగదు తిరిగివచ్చింది.. ఎప్పటికల్లా బ్యాంకుల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరతాయి వంటి ప్రశ్నలకు సమాధానం రాలేదు. చూడబోతే డీమోనిటైజేషన్‌పై ఆర్‌బీఐ అధికారులు రక్షణాత్మక వైఖరితో వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తోంది‘ అని సమావేశం అనంతరం విపక్షానికి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
డీమోనిటైజేషన్‌పై గతేడాది నుంచే చర్చలు..
పెద్ద నోట్ల రద్దు, ప్రభావాల అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థిక) ఆదేశించిన మీదట ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ అధికారులు కమిటీ ముందు హాజరయ్యారు. డిప్యూటీ గవర్నర్లు ఆర్ గాంధీ, ఎస్‌ఎస్ ముంద్రాలతో కలిసి ఉర్జిత్ పటేల్ వచ్చారు. డీమోనిటైజేషన్ అంశంపై 2016 తొలి నాళ్ల నుంచి ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయని పటేల్ వివరించారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ప్రభుత్వ ప్రధానోద్దేశాన్ని ఆర్‌బీఐ కూడా ఆమోదయోగ్యంగానే పరిగణించిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు అనంతరం దాదాపు రూ. 9.2 లక్షల కోట్ల విలువ చేసే కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టినట్లు కమిటీకి వివరించారు.
అయితే, సంతృప్తికరమైన సమాధానాలు రానందువల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రశ్నల ప్రక్రియను మరో రోజున కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. పార్లమెంటు బడ్జెట్ సెషన్ విరామం సమయంలో ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ అధికారులను మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ఆర్‌బీఐ గవర్నర్‌తో పాటు ఆర్థిక శాఖ అధికారులను కమిటీ సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. సమయాభావం వల్ల ఆర్థిక శాఖ అధికారులు ఇంకో రోజున వివరణ ఇవ్వనున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రశ్నల ప్రక్రియ పూర్తి చేయడం కుదరలేదు. వారిని మరోసారి పిలిచే అవకాశం ఉంది‘ అని వివరించాయి.
ఆర్‌బీఐకి మన్మోహన్ సింగ్ బాసట..
కమిటీ సభ్యులు ఉర్జిత్ పటేల్‌ను మరింత కటువుగా ప్రశ్నించకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా కొందరు సీనియర్ ఎంపీలు జోక్యం చేసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఆర్‌బీఐని గౌరవించాల్సిన అవసరం ఉందని వారు మిగతా సభ్యులకు సూచించినట్లు సమాచారం. నగదు విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలను పూర్తిగా ఎప్పుడు ఎత్తివేస్తారు మొద లైన ప్రశ్నలకు కచ్చితమైన జవాబు ఇవ్వాలంటూ దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు.
ఆర్‌బీఐ ప్రతిష్టను కాపాడండి.: ఉర్జిత్
రిజర్వ్ బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని గవర్నర్ ఉర్జిత్ పటేల్ సహోద్యోగులకు సూచించారు. సంస్థ పేరు ప్రతిష్టలను కాపాడేందుకు కట్టుబడి ఉండాలని వారికి పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ఎకానమీని స్థిరపర్చేందుకు ఆర్‌బీఐ తీవ్రంగా కృషి చేస్తోందని, ఈ క్రమంలో తలెత్తుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమిష్టి కృషితోనే ఆర్‌బీఐ ప్రఖ్యాతి గాంచిందని పటేల్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 4న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన పటేల్.. ఉద్యోగులను ఉద్దేశించి లేఖ రాయడం ఇదే తొలిసారి. డీమోనిటైజేషన్ తర్వాత ఆర్‌బీఐపై విమర్శలు వెల్లువెత్తడం, అక్రమంగా పాత నోట్ల మార్పిడి చేస్తూ కొందరు అధికారులు పట్టుబడటం తెలిసిందే.