ఇక స్కూటర్ల పైనే సుజుకి ఫోకస్..
అమ్మకాల్లో 70% వాటా వీటిదే
భవిష్యత్‌లో అధిక సామర్థ్యమున్న మోడళ్లు తీసుకొస్తాం...
కంపెనీ జోనల్ మేనేజర్ ప్రభాకర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా స్కూటర్ల విపణిపైనే ఫోకస్ చేసింది. దేశవ్యాప్తంగా సంస్థ అమ్మకాల్లో వీటి వాటా అత్యధికంగా 65-70 శాతం ఉండడమే ఇందుకు కారణం. దీనికితోడు భారత్‌లో స్కూటర్ల మార్కెట్ 12 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. సుజుకి సైతం ఇదే స్థాయిలో పనితీరు కనబరుస్తోంది. దీంతో ట్రెండ్‌కు తగ్గట్టుగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు సంస్థ దక్షిణప్రాంత సేల్స్ జోనల్ మేనేజర్ డి.వి.ప్రభాకర్ తెలిపారు. సోమవారమిక్కడ నారాయణగూడలో నవకర్ సుజుకి షోరూంను ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. దక్షిణాదితోపాటు పశ్చిమ భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని వివరించారు. 100-110 సీసీ బైక్‌ల యజమానులు స్కూటర్లకు మళ్లుతున్నారని చెప్పారు.
150 సీసీ స్కూటర్లు సైతం..
ప్రస్తుతం కంపెనీ 125 సీసీ వరకు సామర్థ్యమున్న స్కూటర్లను భారత్‌లో విక్రయిస్తోంది. 150 సీసీ స్కూటర్ 2017లో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ప్రభాకర్ వెల్లడించారు. యాక్సెస్ 125 మోడల్‌ను మరింత స్పోర్టీ లుక్‌తో తీర్చిదిద్ది ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయనున్నట్టు చెప్పారు. రాబోయే మోడళ్లన్నీ 125 సీసీ, ఆపై సామర్థ్యమున్నవే ఉంటాయన్నారు. భారత్‌లో మోటార్‌సైకిళ్ల విభాగంలో 150 సీసీ, ఆపై సామర్థ్యమున్న విభాగాలే వృద్ధి చెందుతున్నాయి. కంపెనీ సైతం దీనికి అనుగుణంగా మోడళ్లను తెస్తుందని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ నెలకు అన్ని మోడళ్లు కలిపి 1,800 యూనిట్లు విక్రయిస్తోంది. దీనిని 3,000 యూనిట్లకు పెంచాలన్నది లక్ష్యం.