33 శాతం తగ్గిన సిండికేట్ నికరలాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికరలాభంలో 33 శాతం క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 470 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 316 కోట్లకు తగ్గింది. పెరిగిన నిరర్థక ఆస్తులకు అదనంగా రూ. 220 కోట్లు ప్రొవిజనింగ్ కేటాయింపులు చేయడంతో లాభం తగ్గడానికి ప్రధాన కారణంగా సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆంజనేయ ప్రసాద్ పేర్కొన్నారు. సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు రూ. 4,472 కోట్ల నుంచి రూ. 6,049 కోట్లకు పెరిగాయి.
ఇందులో ఎనిమిది అకౌంట్లకు సంబంధించి రూ. 800 కోట్ల రుణాలు పునర్‌వ్యవస్థీకరణ ఆలస్యం కావడంతో ఈ త్రైమాసికంలో ఎన్‌పీఏలుగా చూపించడం జరిగిందని, ఈ మొత్తం తృతీయ త్రైమాసికంలో తగ్గుతాయన్నారు. ప్రస్తుతం 3.43%గా ఉన్న స్థూల ఎన్‌పీఏలను మార్చినాటికి 3%కి పరిమితం చేయాలనేది లక్ష్యమని తెలిపారు.
రూ.4.75 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం
ఈ మార్చి నాటికి వ్యాపారం రూ. 4.75 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. సమీక్షా కాలంలో వ్యాపారం 20 శాతం వృద్ధితో రూ. 4.15 లక్షల కోట్లకు చేరిందన్నారు. నికర వడ్డీ ఆదాయం స్థిరంగా 2,774 కోట్లుగా ఉండగా, ఇతర ఆదాయం 57 శాతం వృద్ధితో రూ.893 కోట్లుగా నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 531 శాఖల ద్వారా రూ. 38,095 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేశామని, మార్చినాటికి ఈ మొత్తం రూ. 50,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
డిసెంబర్లోగా 1,600 కోట్ల సమీకరణ
వ్యాపార విస్తరణకు వివిధ మార్గాల ద్వారా రూ. 3,250 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, డిసెంబర్‌లోగా రూ.1,600 కోట్లు సేకరించనున్నట్లు ఆంజనేయ ప్రసాద్ వెల్లడించారు. క్యాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్(క్యూఐపీ) ద్వారా రూ. 1,100 కోట్ల సమీకరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, ఇది కాకుండా టైర్2 బాండ్స్ ద్వారా రూ.1,150 కోట్లు, టైర్ 1 బ్యాండ్స్ జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. గతేడాది సుమారు 4,000 మంది సిబ్బందిని నియమించుకోగా.. ఈ ఏడాది మరో 5,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రసాద్ తెలిపారు.