ఆర్‌బీఐ అనుమతులు అక్కర్లేదు
ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: జపాన్ టెలికం దిగ్గజం ఎన్‌టీటీ డొకొమోకు టాటా గ్రూప్ 1.17 బిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించిన విషయంలో రిజర్వ్ బ్యాంక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జాయింట్ వెంచర్‌లో భాగస్వామ్య వాటాలకు కొనుగోలుదారును అన్వేషించలేకపోయినందువల్ల డొకొమోకు టాటా గ్రూప్ పరిహారాన్ని చెల్లించటాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది.
ఈ డీల్‌ను భారత్‌లో అమలు చేయొచ్చని, దీనికోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రత్యేకంగా అనుమతులు పొందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తమనూ పార్టీగా చేర్చుకోవాలన్న ఆర్‌బీఐ అభ్యర్ధనను తోసిపుచ్చింది. చెల్లింపు విషయంలో ఇరుపక్షాలకు ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు.. డీల్ అమలుకు ఆటంకాలేమి లేవని న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంలో ఆర్‌బీఐ అనుమతినివ్వకుండా నిరాకరించడానికేమీ లేదని స్పష్టం చేసింది.
ఇదీ కథ..
టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్‌ఎల్), ఎన్‌టీటీ డొకొమో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నిబంధనల ప్రకారం డొకొమో గానీ వైదొలగాలనుకున్న పక్షంలో దాని 26.5 శాతం వాటాను నిర్దిష్ట రేటుకు కొనుగోలు చేసే వారిని టీటీఎస్‌ఎల్ వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. డొకొమో వైదొలగాలనుకున్నప్పుడు రేటు షేరుకు సుమారు రూ.58.45గా ఉంది. మొదటి ఆప్షన్ కుదరనప్పుడు సముచిత మార్కెట్ వేల్యూ ప్రకారం .. టీటీఎస్‌ఎల్ స్వయంగా ఆ షేర్లను కొనుగోలు చేసేలా మరో ఆప్షన్ ఉంది. దీని ప్రకారం చూస్తే షేరు ఒక్కింటికి రూ. 23.44 మాత్రమే పలుకుతుంది.
రెండో ఆప్షన్‌కు అంగీకరించని డొకొమో ఆర్బిట్రేషన్‌కి వెళ్లగా.. 1.17 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా 2016 జూన్‌లో లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆదేశాలిచ్చింది. సుదీర్ఘ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఇరు సంస్థలు దీనికి అంగీకరించాయి. టాటా ఇప్పటికే 1.17 బిలియన్ డాలర్లు హైకోర్టులో డిపాజిట్ కూడా చేసింది. అయితే, రెండు కంపెనీల మధ్య ఒప్పందం చెల్లదంటూ ఆర్‌బీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం మళ్లీ కోర్టుకు చేరింది. తాజాగా ఆర్‌బీఐ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది.
డొకొమోకు టాటా పరిహారం సబబే
Published Sat, Apr 29 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
Advertisement
Advertisement