Tata-Docomo
-
డొకొమోకు టాటా పరిహారం సబబే
ఆర్బీఐ అనుమతులు అక్కర్లేదు ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకొమోకు టాటా గ్రూప్ 1.17 బిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించిన విషయంలో రిజర్వ్ బ్యాంక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జాయింట్ వెంచర్లో భాగస్వామ్య వాటాలకు కొనుగోలుదారును అన్వేషించలేకపోయినందువల్ల డొకొమోకు టాటా గ్రూప్ పరిహారాన్ని చెల్లించటాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. ఈ డీల్‌ను భారత్‌లో అమలు చేయొచ్చని, దీనికోసం రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రత్యేకంగా అనుమతులు పొందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తమనూ పార్టీగా చేర్చుకోవాలన్న ఆర్బీఐ అభ్యర్ధనను తోసిపుచ్చింది. చెల్లింపు విషయంలో ఇరుపక్షాలకు ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు.. డీల్ అమలుకు ఆటంకాలేమి లేవని న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంలో ఆర్బీఐ అనుమతినివ్వకుండా నిరాకరించడానికేమీ లేదని స్పష్టం చేసింది. ఇదీ కథ.. టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్), ఎన్టీటీ డొకొమో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నిబంధనల ప్రకారం డొకొమో గానీ వైదొలగాలనుకున్న పక్షంలో దాని 26.5 శాతం వాటాను నిర్దిష్ట రేటుకు కొనుగోలు చేసే వారిని టీటీఎస్ఎల్ వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. డొకొమో వైదొలగాలనుకున్నప్పుడు రేటు షేరుకు సుమారు రూ.58.45గా ఉంది. మొదటి ఆప్షన్ కుదరనప్పుడు సముచిత మార్కెట్ వేల్యూ ప్రకారం .. టీటీఎస్ఎల్ స్వయంగా ఆ షేర్లను కొనుగోలు చేసేలా మరో ఆప్షన్ ఉంది. దీని ప్రకారం చూస్తే షేరు ఒక్కింటికి రూ. 23.44 మాత్రమే పలుకుతుంది. రెండో ఆప్షన్‌కు అంగీకరించని డొకొమో ఆర్బిట్రేషన్‌కి వెళ్లగా.. 1.17 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా 2016 జూన్‌లో లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆదేశాలిచ్చింది. సుదీర్ఘ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఇరు సంస్థలు దీనికి అంగీకరించాయి. టాటా ఇప్పటికే 1.17 బిలియన్ డాలర్లు హైకోర్టులో డిపాజిట్ కూడా చేసింది. అయితే, రెండు కంపెనీల మధ్య ఒప్పందం చెల్లదంటూ ఆర్బీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం మళ్లీ కోర్టుకు చేరింది. తాజాగా ఆర్బీఐ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. -
టాటా సన్స్‌కు ఊరట, ఆర్బీఐకి ఝలక్
న్యూఢిల్లీ: జాయింట్ వెంచర్ సంస్థ టాటా టెలీ సర్వీసెస్ ఎన్టీటీ డొకోమోతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా టెలికామ్‌కు ఢిల్లీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బిట్రేషన్ అవార్డును సమర్ధించడం ద్వారా ఈ ఒప్పందం విషయంలో రిజర్వ్ బ్యాంక్ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. 2016 జూన్‌లో లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు చెల్లించేందుకు టాటా అంగీకరించింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను ఆర్బీఐ వ్యతిరేకించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ తదాఖలు చేసిన మధ్యంతపర పిటీషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వివాదంలో టాటా సన్స్‌కు భారీ ఊరట లభించింది. కాగా జపాన్ టెలికామ్ సంస్థ ఎన్‌టిటి డొకోమోతో చిరకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా టెలికామ్ నిర్ణయించింది. ఈ మేరకు డొకోమోతో కోర్టు వెలుపల ఒక అంగీకారానికి వచ్చింది. వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు చెల్లించేందుకు టాటా గ్రూప్ అంగీకరించినంది. తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని తెలియజేస్తూ, రెండు సంస్థలు ఉమ్మడిగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాయి. కోర్టు వెలుపల కుదిరిన తమ ఒప్పందాన్ని అంగీకరించి, ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న విచారణకు స్వస్తిచెప్పాలని రెండు సంస్థలూ కోర్టును అభ్యర్ధించాయి. ఈమేరకు టాటా సన్స్ 117 కోట్ల డాలర్లను కోర్టులో డిపాజిట్ కూడా చేసింది. టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని టాటాలు నిర్ణయించారు. అయితే దీన్ని ఆర్బీఐ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
టాటా-డొకోమొ సెటిల్మెంట్ను వ్యతిరేకించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమోతో, టాటా సన్స్ సెటిల్మెంట్కు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నో చెప్పింది. టాటా డొకోమో మధ్య ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్బీఐ ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో తన వాదనను వినిపించింది. డొకొమొ, షేర్ల బదిలీ అక్రమమని ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ సందర్భంగా ఆర్బీఐ వాదించింది. అయితే ఆర్బీఐ వాదనలను హైకోర్టు కొట్టి పారేసింది. దీనిపై పూర్తి వివరణను కోరింది. తమ అభ్యంతరాలపై నివేదిక సమర్పించ్సాలిందిగా జస్టిస్ ఎస్మురళీధర్ ఆర్బీఐని కోరారు. తదుపరి విచారణ తేదీ మార్చి 14 న కోర్టు ముందు తన వైఖరిని సమర్పిస్తుందని ఆర్బీఐ చెప్పింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. వివాద పరిష్కారానికి రెండు సంస్థల ప్రయత్నాలకు ఇండో-జపనీస్ సంబంధాలకు ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించింది. కాగా గత రెండేళ్లు గా టాటా సన్స్ ,జపనీస్ ప్రముఖ టెలికాం సంస్థ ఎన్టీటీ డొకొమొ మధ్య సాగుతున్న వివాదానికి 1.17 బిలియన్ డాలర్లను(దాదాపు రూ. 7,900 కోట్లు) చెల్లించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం టాటా సన్స్ 1.17 బిలియన్ డాలర్లను ఇప్పటికే డిపాజిట్ చేసింది.