
పెరగనున్న టాటా కార్ల ధరలు
న్యూఢిల్లీ: పెరిగిన ముడి సరుకుల వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కీలకమైన పండుగల సమయంలో కార్ల ధరలను పెంచే ఆలోచనల్లో టాటా గ్రూప్ ఉంది. కార్ల ధరలను పెంచనున్నామని, దీనిపై తాము దృష్టి సారించామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ప్రెసిడెంట్ మయాంక్ ప్రతీక్ తెలిపారు. పండుగల సీజన్‌లో కార్ల ధరల పెంపు ఉంటుందని చూచాయగా చెప్పారు. ఉత్పాదక వ్యయాలు పెరగడమే ధరల పెంపునకు కారణంగా పేర్కొన్నారు.
ఇప్పటికే కొన్ని సంస్థలు ధరలు పెంచాయని, తాము కూడా చాలా కాలంగా ధరలను సవరించని విషయాన్ని ప్రతీక్ పేర్కొన్నారు. టాటా మోటార్స్ రూ.2.15 లక్షలు-16.3 లక్షల శ్రేణిలో నానో, టియాగో, ఏరియా తదితర మోడళ్లను విక్రయిస్తోంది.