
విశ్వాసం కోల్పోయినందుకే వేటు!
విద్వేషాలు ఒక స్థాయికి చేరిపోతే ఇక పరువు మర్యాదల గురించి పట్టించుకోరనేది నానుడి. టాటా గ్రూప్ విషయంలో అలాగే జరుగుతోంది.
మిస్త్రీ లేఖాస్త్రంపై తీవ్రంగా స్పందించిన టాటా సన్స్
• సారథిగా పూర్తి అధికారాలిచ్చాం...ఆరోపణలన్నీ నిరాధారం, కుట్రపూరితం...
• బోర్డు సభ్యులకు రాసిన ‘రహస్య’ ఈ-మెయిల్ బయటికెలావచ్చింది?
• మాపై బురదజల్లడం కోసమే లీక్ చేశారు.ఇది సంస్కారహీనమైన చర్య...
• టాటాల సంస్కృతి, సాంప్రదాయాలను ఆయన మంటగలిపారు...
ముంబై: విద్వేషాలు ఒక స్థాయికి చేరిపోతే ఇక పరువు మర్యాదల గురించి పట్టించుకోరనేది నానుడి. టాటా గ్రూప్ విషయంలో అలాగే జరుగుతోంది. దేశంలో నంబర్-1 గ్రూప్‌గా ఇన్నాళ్లూ ప్రజల విశ్వసనీయతను, గౌరవాన్ని అందుకున్న ఈ గ్రూప్ పరువు తాజా పరిణామాలతో వీధికెక్కుతోంది. సైరస్ మిస్త్రీని తొలగించాక ఆయన సంధించిన లేఖాస్త్రానికి... మళ్లీ టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డు స్పందిం చింది. మిస్త్రీ ఏ స్థాయిలో అయితే విమర్శలు చేశారో... అదే స్థాయిలో టాటా గ్రూప్ కూడా విరుచుకుపడింది.
డైరెక్టర్ల విశ్వాసాన్ని కోల్పోయినందుకే మిస్త్రీపై వేటు వేయాల్సివచ్చిందంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మిస్త్రీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమే కాదు! కుట్రపూరితమైనవి కూడా. ప్రతిష్టాత్మక టాటా గ్రూప్‌ను నడిపించే బాధ్యతను ఆయనకు పూర్తి అధికారాలతోనే కట్టబెట్టాం. అయినా, ఆయన అనేక విషయాల్లో డైరెక్టర్ల విశ్వాసాన్ని కోల్పోయారు. అసలు బోర్డు సభ్యులకు రాసిన రహస్య ఈ-మెయిల్‌లోని విషయాలు బయటికెలా వచ్చాయి? కావాలనే దీన్ని వెల్లడి చేశారనేది అర్థమవుతోంది కదా!! ఇది చాలా దురదృష్టకరం, సంస్కారహీనమైన చర్య’’ అని టాటా సన్స్ పేర్కొంది.
మా సంస్కృతిని అతిక్రమించారు...
‘‘టాటా గ్రూప్‌లో ఉన్న విశిష్టమైన సంస్కృతి, సాంప్రదాయాలకు భిన్నంగా మిస్త్రీ పలుమార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టాటా గ్రూపు, టాటా సన్స్ బోర్డు, గ్రూప్‌లోని అనేక కంపెనీలతో పాటు గౌరవప్రదమైన వ్యక్తులపై కావాలని బురదజల్లడం కోసమే మిస్త్రీ తన లేఖలో నిరాధారమైన కుట్రపూరిత ఆరోపణలను చేశారు’’ అని టాటా సన్స్ తిప్పికొట్టింది. అంతేకాదు తనను ‘అచేతన’ చైర్మన్‌గా మార్చేశారన్న వ్యాఖ్యలను కూడా కొట్టిపారేసింది. ‘‘స్వతంత్రంగా వ్యవహరించేలానే ఆయనకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాం.
కానీ పదవి నుంచి తొలగించామనే ఉక్రోషంతో రతన్ టాటా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై తప్పుదోవపట్టించే ఆరోపణలు చేశారు. అది చాలా దురదృష్టకరం. అంతేకాదు 2006 నుంచీ టాటా గ్రూప్‌తో ప్రత్యక్ష సాన్నిహిత్యం ఉన్న మిస్త్రీకి... గ్రూపుతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన యాజమాన్య స్వరూపం, ఆర్థిక, నిర్వహణపరమైన విధివిధానాలన్నీ పూర్తిగా తెలుసు. గ్రూప్ ప్రతిష్టను మంటగలపడమే మిస్త్రీ ఆరోపణల లక్ష్యం. ఈ విషయంలో ఆయనను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించలేం’’ అని కూడా టాటా సన్స్ తేల్చిచెప్పింది.
పదవిలో ఉన్నప్పుడు గుర్తుకురాలేదా...
టాటా గ్రూప్ కంపెనీల్లో కార్పొరేట్ నైతిక నిమయాల ఉల్లంఘన జరిగిందని మిస్త్రీ ఆరోపించటంపై కూడా టాటా సన్స్ తీవ్రంగానే స్పందించింది. ‘ఆయన చైర్మన్‌గా పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆయనకు గుర్తుకురాలేదా? అప్పుడే వీటిని లేవనెత్తి ఉంటే బాగుండేది. అయినా, ఆయన చేసిన ఆరోపణలన్నీ అర్థరహితమని చెప్పేందుకు కంపెనీల వద్ద అనేక ఆధారాలున్నాయి. వీటన్నిటినీ అవసరమైనపుడు నియంత్రణ సంస్థలు, ఇతర ఏజెన్సీలకు అందిస్తాం’ అని పేర్కొంది.
ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కలేదు..
ఉన్నపళంగా మిస్త్రీ ఉద్వాసనకు కారణాలేంటనేటు విషయమై టాటా సన్స్ వివరణిచ్చే ప్రయత్నం చేసింది. ‘‘మిస్త్రీ తీసుకున్న కొన్ని వ్యాపారపరమైన నిర్ణయాలు, అంశాలకు సంబంధించి బోర్డు డెరైక్టర్లు పదేపదే ప్రశ్నించారు. ఆందోళన కూడా వ్యక్తం చేశారు. టాటా ట్రస్ట్‌ల ధర్మకర్తలు కూడా మిస్త్రీ విశ్వసనీయత కోల్పోతున్నారంటూ అనేకమార్లు ఆందోళన వ్యక్తపరిచారు. ఆయన ఇవేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఆయన తొలగింపు బోర్డు సభ్యుల సమిష్టి నిర్ణయం. మిస్త్రీ ఆరోపణలన్నీ అబద్ధాలే. వాటిపై మాట్లాడటమంటే మా గ్రూపు పేరుప్రతిష్టలకే అవమానకరం. సమస్యల నుంచి పారిపోవటమనేది మా గ్రూప్ మనస్తత్వం కాదు. అదేవిధంగా ఆరోపణల్ని అదేపనిగా తిప్పికొట్టాల్సిన పనీలేదు. గ్రూపు ఉజ్వల భవిత లక్ష్యంగా ఎలాంటి సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొంటాం’’ అని టాటా సన్స్ స్పష్టం చేసింది.
6 లక్షల మంది ఉద్యోగుల స్ఫూర్తితోనే...
‘బోర్డు రూమ్‌లో అనుసరించే సాంప్రదాయాలు, విలువలు ఒక్కటే గ్రూప్ పటిష్టతకు కారణం కాదు. మొత్తం 6 లక్షల మందికిపైగా ఉద్యోగులు తమ విలువలకు కట్టుబడి పనిచేయడమే అన్నింటికంటే కీలకమైన అంశం. వారు అందిస్తున్న స్ఫూర్తి, సహకారంవల్లే గ్రూప్ ఇప్పుడు ఇంత ఉన్నతస్థానంలో నిలబడగలిగింది’ అని టాటా సన్స్ వ్యాఖ్యానించింది.
ఆరోపణలపై దృష్టి పెడతాం...విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు
టాటాల జాయింట్ వెంచర్ కంపెనీ ఎయిర్ ఏషియా ఇండియాలో రూ.22 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయంటూ మిస్త్రీ చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. దీనిపై దృష్టిపెడతామని.. ఒకవేళ ఏవైనా నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం విలేకరులకు చెప్పారు. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లతో వేర్వేరు జాయింట్ వెంచర్ల ఏర్పాటు ద్వారా టాటా గ్రూప్ మళ్లీ విమానయాన రంగంలోకి అడుగుపెట్టడం తెలిసిందే. అయితే, రతన్ టాటా ఒత్తిడివల్లే ఈ రంగంలోకి గ్రూప్ మళ్లీ రావాల్సి వచ్చిందని మిస్త్రీ ఆరోపించారు.
జేవీతో ఎఫ్‌డీఐ విధానానికి విఘాతం..: ఎఫ్‌ఐఏ
న్యూఢిల్లీ: టాటా-ఎయిర్‌ఏషియా ఒప్పందం డీజీసీఏ (డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానానికి పూర్తి వ్యతిరేకమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్‌ఐఏ) పేర్కొంది. టాటా-ఎయిర్‌ఏషియాకు మంజూరు చేసిన ఆపరేషన్ ఏవియేషన్ అనుమతుల రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు 2014 ఏప్రిల్ నుంచీ ఢిల్లీ హైకోర్టులో పెండింగులో ఉందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికి ఈ కేసు విచారణ 17 సార్లు వాయిదా పడిందని పేర్కొన్న ఎఫ్‌ఐఏ, కనీసం కేసు విచారణ వేగవంతానికైనా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. లెసైన్సుకు దరఖాస్తు చేసేటప్పుడు ఎయిర్‌ఏషియా తన బ్రాండ్ ఈక్విటీ ఎగ్రిమెంట్ వివరాలను వెల్లడించలేదని ఎఫ్‌ఐఏ పేర్కొంది.
‘నానో’ ఘనత రతన్‌దే: భార్గవ
సామాన్యులకూ అందుబాటు ధరల్లో కారును అందించడం కోసం ‘నానో’కు రూపకల్పన చేసిన ఘనత రతన్ టాటా సొంతమని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్‌కు నానో గుదిబండగా మారిందని.. దీన్ని మూసేస్తేనే కంపెనీ బాగుపడుతుందంటూ మిస్త్రీ తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ‘అత్యంత చౌక ధరకే కారు అందించాలన్న టాటాల ఉద్దేశం చాలా అభినందించదగినది. మేం (మారుతీ) కూడా ఇందుకు ప్రయత్నించలేదు. వాళ్లు చేసి చూపించారు’ అన్నారు. తాజా పరిణామాలపై స్పందిస్తూ... ఇది టాటా గ్రూప్ అంతర్గత వ్యవహారమని.. బయటి వ్యక్తులు దీనిపై వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని చెప్పారు.
మిస్త్రీని తొలగించిన విధానం తప్పు: సుప్రియా సూలే
సైరస్ మిస్త్రీని తొలగించిన విధానం సరికాదని ఎన్‌సీపీ ఎంపీ, శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే పేర్కొన్నారు. ‘పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలున్న టాటా గ్రూప్‌లో నిర్ణయాలన్నీ పారదర్శకంగా ఉంటాయి. విభేదాలుంటే ఉండొచ్చు. బోర్డు సభ్యులకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉంది. అయితే, చైర్మన్‌ను తొలగించే విషయంలో వారు అనుసరించిన విధానాన్నే నేను తప్పుబడుతున్నా. గౌరవప్రదంగా వ్యవహరించి ఉండాల్సింది’ అని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రియకు మిస్త్రీ, ఆయన భార్య రోహికా మంచి స్నేహితులు కావడం గమనార్హం.
అన్ని విషయాలను తెలియజేశాం: టాటా స్టీల్
తమ కంపెనీ కార్యకలాపాలు, వ్యవహరాలకు సంబంధించిన వివరాలన్నింటినీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశామని టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్ గురువారం వివరణ ఇచ్చాయి. మిస్త్రీ ఆరోపణలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయాలేవీ లేవని స్పష్టం చేశాయి. కాగా, టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్ ఇతరత్రా కంపెనీలు దాదాపు రూ.1.18 లక్షల కోట్ల నష్టాలను చవిచూడాల్సి(రైట్‌డౌన్) వస్తుందంటూ మిస్త్రీ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.