టాటా స్టీల్ లాభం1,036 కోట్లు
ముంబై: టాటా స్టీల్ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి రూ. 1,036 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అమ్మకాలు పుంజుకోవడం, దేశీయంగా మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో కంపెనీ రూ.6,529 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదే కాలానికి ఆదాయం 22%పైగా ఎగసి రూ.42,428 కోట్లను తాకింది.
యూరోపియన్ కార్యకలాపాలు పుంజుకోవడంతో నిర్వహణ మార్జిన్లు 2.57% మేర మెరుగుపడినట్లు గ్రూప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కౌశిక్ చటర్జీ పేర్కొన్నారు. కాగా, పూర్తిఏడాదికి(2013-14) కంపెనీ రూ. 3,595 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతంలో రూ. 7,058 కోట్ల నష్టాలను నమోదు చేసుకుంది. ఈ కాలంలో నికర అమ్మకాలు రూ. 1,33,538 కోట్ల నుంచి రూ. 1,47,347 కోట్లకు పెరిగాయి.