
టాటా స్టీల్ టర్న్ అరౌండ్
నికర లాభం రూ.921 కోట్లు
గతంతో పోలిస్తే 4 రెట్ల పెరుగుదల
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ టర్న్ అరౌండ్ అయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది జూన్ క్వార్టర్లో రూ. 3,183 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించిన టాటా స్టీల్, తాజా త్రైమాసికంలో రూ. 921.09 కోట్ల నికరలాభాన్ని కనపర్చింది. కంపెనీ మొత్తం ఆదాయం 19 శాతం వృద్ధిచెంది రూ. 25,970 కోట్ల నుంచి రూ. 30,973 కోట్లకు చేరింది. అయితే గతేడాది ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో కంపెనీ యూరప్‌లో కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేసిన పనితీరును పరిగణనలోకి తీసుకుని భారీ నష్టాన్ని వెల్లడించగా, కొనసాగించిన కార్యకలాపాల ప్రకారం మాత్రం అప్పట్లో రూ. 209 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.
ఈ లాభాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే (కొనసాగిన కార్యకలాపాల ప్రకారం) 2017 జూన్ క్వార్టర్లో కంపెనీ నికరలాభం రూ. 209 కోట్ల నుంచి నాలుగింతలై రూ. 933 కోట్లకు చేరింది. ఇండియాలోనూ, యూరప్‌లోనూ తమ ఉక్కు వ్యాపారం పటిష్టమైన పనితీరును కనపర్చిందని, ఆగ్నేయాసియాలో మాత్రం కార్యకలాపాలు దెబ్బతిన్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. ఆగ్నేయాసియాలో మైనింగ్ లిటిగేషన్ల కోసం రూ. 617 కోట్లు కేటాయింపులు జరిపామని, దీనిని మినహాయిస్తే తమ నికరలాభం రూ. 1,550 కోట్లకు చేరినట్లవుతుందని కంపెనీ వివరించింది.
ఇండియాలో....
ఇండియాలో కళింగనగర్ ప్లాంటు విస్తరణతో తమ ప్లాంట్ల నుంచి 27.5 లక్షల టన్నుల ఉక్కు సరఫరా జరిగిందని, ఇది గతేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 28 శాతం అధికమని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌తో పోలిస్తే సరఫరాలు 14 శాతం తగ్గాయని, ఇందుకు సీజన్, జీఎస్‌టీ కారణమని కంపెనీ తెలిపింది. ఇండియా కార్యకలాపాల ద్వారా ఆపరేటింగ్ లాభం 2016 జూన్ క్వార్టర్‌కంటే 31 శాతం పెరుగుదలతో రూ. 2,922 కోట్లకు చేరింది. కానీ నికరలాభం 12 శాతం క్షీణించి రూ. 506 కోట్లకు తగ్గింది.
యూరప్‌లో....
యూరప్‌లో మార్కెట్ పరిస్థితులు మెరుగుపడుతున్నందున, అక్కడి కార్యకలాపాల ఆదాయం 28 శాతం వృద్ధితో 170.3 కోట్ల పౌండ్లకు పెరిగినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడగా... సోమవారం టాటా స్టీల్ షేరు ధర బీఎస్‌ఈలో 4.26 శాతం పెరుగుదలతో రూ. 600 వద్ద ముగిసింది.