టాటా స్టీల్ యూరప్ యూనిట్.. ఒక్క పౌండే | Tata to Sell European Long Products Division to Greybull Capital | Sakshi
Sakshi News home page

టాటా స్టీల్ యూరప్ యూనిట్.. ఒక్క పౌండే

Published Tue, Apr 12 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

టాటా స్టీల్ యూరప్ యూనిట్.. ఒక్క పౌండే

టాటా స్టీల్ యూరప్ యూనిట్.. ఒక్క పౌండే

లాంగ్ ప్రాడక్ట్స్ వ్యాపారాన్ని
దక్కించుకుంటున్న గ్రేబుల్ క్యాపిటల్

 ముంబై: యూరప్‌లో టాటా స్టీల్‌కున్న యూనిట్లలో ఒకదానిని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌కు  విక్రయించనుంది. ఈ యూనిట్‌కు భారీగా ఉన్న అప్పులను టేకోవర్ చేసినందుకుగాను కేవలం ఒక్క పౌండ్ నామమాత్ర ధరనే గ్రేబుల్ చెల్లిస్తోంది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ తయారుచేసే యూనిట్‌ను ఆస్తులు, అప్పులతో సహా  40 మిలియన్ పౌండ్ల ప్యాకేజీని గ్రేబుల్ టేకోవర్ చేస్తుంది. ఈ వ్యాపారానికి అవసరమైన భవిష్యత్తు వర్కింగ్ క్యాపిటల్, పెట్టుబడి నిధుల్ని గ్రేబుల్ బ్యాంకుల నుంచి, తన షేర్‌హోల్డర్ల నుంచి సమీకరిస్తుంది. ఉక్కు దిగ్గజ సంస్థ కోరస్‌ను దాదాపు దశాబ్దం కింద కొని, భారీ నష్టాల్లో చిక్కుకున్న టాటా స్టీల్ ఇటీవల యూరప్ వ్యాపార విక్రయానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఈ యూనిట్లో పనిచేస్తున్న 4,400 మంది ఉద్యోగుల్లో కోతలేవీ విధించరు. కాకపోతే 3 శాతం మేర వేతనాలు తగ్గిస్తారు.

 లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో భాగమైన టీస్సైడ్, ఉత్తరఫ్రాన్స్‌ల్లో వున్న స్కంథ్రోప్ స్టీల్‌వర్క్స్, వర్కింగ్‌టన్‌లో వున్న ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌ను, యార్క్‌లో వున్న డిజైన్ కన్సల్టెన్సీని, ఇతర అనుబంధ పంపిణీ సదుపాయాల్ని గ్రేబుల్ తీసుకుంటుంది. చైనా నుంచి ముంచెత్తుతున్న దిగుమతుల కారణంగా యూరప్ ఉక్కు పరిశ్రమలో క్లిష్టపరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో టాటా స్టీల్ యూకె, గ్రేబుల్ క్యాపిటల్ మధ్య ఒప్పందం కుదురుతున్నందుకు టాటాస్టీల్ యూరప్ సీఈఓ హాన్స్ ఫిషర్ సంతోషం వ్యక్తం చేశారు. నిధుల సమీకరణ, కీలక సరఫరాదారులతో ఒప్పందాలకు లోబడి ఈ డీల్ 8 వారాల్లో పూర్తవుతుందని గ్రేబుల్ క్యాపిటల్ ప్రకటించింది. ప్రస్తుత యాజమాన్యమే వ్యాపారాన్ని నడుపుతుందని, కంపెనీ తిరిగి లాభాలబాట పట్టేందుకు రూపొందించిన ప్రణాళికను అమలు జరుపుతుందని, ఒక శాశ్వత సీఈఓను నియమించే ప్రక్రియ మొదలుపెట్టామని గ్రేబుల్ వివరించింది.

 కంపెనీ యూరప్ వ్యాపారంలో లాంగ్, స్ట్రిప్ స్టీల్ యూనిట్లు యూకేలోనూ, ఫ్లాట్ ప్రొడక్టుల యూనిట్ నెదర్లాండ్స్‌లోనూ వున్నాయి. పోర్ట్ టాల్బెట్‌లో వున్న టాటా స్టీల్ స్ట్రిప్ యూనిట్‌ను కొనుగోలుచేయడానికి భారతీయ సంతతికి చెందిన లిబర్టీ హవుస్ వ్యవస్థాపకుడు సంజీవ్ గుప్తా ఆసక్తి చూపిస్తున్నారు. టాటా స్టీల్ యూకే వ్యాపారానికి సంబంధించి టాటా స్టీల్‌కు 4 బిలియన్ డాలర్ల రుణం వుంది. అయితే యూనిట్లవారీగా వున్న రుణాల్ని కంపెనీ వెల్లడించలేదు. కోరస్‌ను 2007లో 12.1 బిలియన్ డాలర్లకు టాటా స్టీల్ కొనుగోలు చేసింది. బలహీనమైన డిమాండ్, చౌక చైనా దిగుమతుల ఫలితంగా ఈ వ్యాపారం భారీ నష్టాల్ని చవిచూసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement