
భారీగా క్యాంపస్ హైరింగ్: టీసీఎస్
2015-16లో 35 వేల పైచిలుకు ఫ్రెషర్ల నియామకానికి యోచన
ముంబై: సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగా క్యాంపస్ నియామకాలు చేపట్టనుంది. మొత్తం 35,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల నియామకాలతో పోలిస్తే ఇది 10,000 అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 25,000 పైచిలుకు ఆఫర్లు ఇవ్వగా, 71-72 శాతం మంది ఫ్రెషర్లు చేరే అవకాశముందని భావిస్తున్నట్లు ముఖర్జీ పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లతో పాటు ఇతర దరఖాస్తుదారులకు సంబంధించి తాము నిర్దేశించుకున్న 55,000 నియామకాల లక్ష్యాన్ని మించి హైరింగ్ ఉండగలదని ఆయన వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు తగ్గిందని, భవిష్యత్‌లో ఇది మరింత తగ్గొచ్చని తెలిపారు. మరోవైపు, 2015-16 ఏడాది రిక్రూట్‌మెంట్స్‌కి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని, క్యాంపస్‌లను సందర్శిస్తున్నామని ముఖర్జీ పేర్కొన్నారు. సుమారు 350-400 విద్యా సంస్థలను సందర్శించనున్నట్లు ఆయన వివరించారు.