బైబ్యాక్‌కు టీసీ‘ఎస్‌’ | TCS announces its biggest share buyback in at least five years | Sakshi
Sakshi News home page

బైబ్యాక్‌కు టీసీ‘ఎస్‌’

Published Thu, Jan 13 2022 4:24 AM | Last Updated on Thu, Jan 13 2022 4:24 AM

TCS announces its biggest share buyback in at least five years - Sakshi

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పీడిస్తున్నప్పటికీ దేశీ దిగ్గజాల సాఫ్ట్‌వేర్‌ సేవలకు డిమాండ్‌ కొనసాగుతోంది. కోవిడ్‌–19 ప్రభావంతో ఇటీవల ఆన్‌లైన్‌ సర్వీసులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్‌ నెలకొంది. ఇది దేశీ ఐటీ దిగ్గజాలకు కలసి వస్తున్నట్లు సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మోడల్‌కు ఐటీ కంపెనీలు మొగ్గు చూపినప్పటికీ ఫ్రెషర్స్‌ నియామకాలు పెరుగుతూ వస్తున్నాయి.

ఇటీవల డిజిటల్‌ సేవలు విస్తరిస్తుండటంతో అంతర్జాతీయంగా పలు కంపెనీలు డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కోసం భారీ నిధులను కేటాయిస్తున్నాయి. దీంతో దేశీ కంపెనీలు భారీ కాంట్రాక్టులను కుదుర్చుకుంటున్నాయి. వెరసి ఈ ఏడాది క్యూ3లో ఐటీ దిగ్గజాలు మరోసారి ఆకర్షణీయ పనితీరును ప్రదర్శించాయి. టీసీఎస్‌ అయితే మరోసారి సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసింది. వివరాలు చూద్దాం..

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవలకు అగ్రస్థానంలో నిలుస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఈ ఏడాది(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించింది. అంతేకాకుండా రూ. 18,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)ను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 12 శాతంపైగా ఎగసింది. రూ. 9,769 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 8,701 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం వృద్ధితో రూ. 48,885 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 42,015 కోట్ల టర్నోవర్‌ నమోదైంది.  

షేరుకి రూ. 4,500
షేరుకి రూ. 4,500 ధర మించకుండా 4 కోట్ల ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు టీసీఎస్‌ వెల్లడించింది. 1.08 శాతం ఈక్విటీకి ఇవి సమానంకాగా.. ఇందుకు రూ. 18,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గత కేలండర్‌ ఏడాది(2021)లో కంపెనీ కీలకమైన 25 బిలియన్‌ డాలర్ల ఆదాయ మైలురాయిని అందుకున్నట్లు సీవోవో ఎన్‌.గణపతి సుబ్రమణ్యం తెలియజేశారు. నైపుణ్యాలపై వెచ్చిస్తున్న పెట్టుబడులతో సరఫరాల సవాళ్లలోనూ పటిష్ట పురోగతిని సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్‌ సేక్సారియా పేర్కొన్నారు. 2021–22 తొలి అర్ధభాగంలో తీసుకున్న 43,000 మంది ఫ్రెషర్స్‌ కాకుండా తాజా త్రైమాసికంలో 34,000 మందిని ఎంపిక చేసినట్లు సీహెచ్‌ఆర్‌వో మిలింద్‌ లక్కడ్‌ వెల్లడించారు.  

ఇతర హైలైట్స్‌
► వాటాదారులకు షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్‌. ఇందుకు రికార్డ్‌ డేట్‌ ఫిబ్రవరి 7.
► క్యూ3లో నికరంగా 28,238 మందికి ఉపాధిని కల్పించింది.  
► డిసెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 5,56,986కు చేరింది.
► ఉద్యోగ వలసల రేటు 15.3%గా నమోదైంది.
► డిసెంబర్‌కల్లా నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 59,920 కోట్లుగా నమోదు.
► కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 72.19%.

మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి. షేరు 1.5% నీరసించి రూ. 3,857 వద్ద ముగిసింది.

కస్టమర్ల బిజినెస్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ అవసరాలకు అనుగుణమైన సర్వీసులు అందించడంలో కంపెనీకున్న సామర్థ్యాలను తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎండ్‌టుఎండ్‌ నైపుణ్యాలు, సవాళ్ల పరిష్కారంలో కంపెనీ చూపుతున్న చొరవ తదితర అంశాలు క్లయింట్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితాలలో వృద్ధి కొనసాగడమే ఇందుకు నిదర్శనం.  

– రాజేష్‌ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement