రూపీ దెబ్బ: టెక్ దిగ్గజం టీసీఎస్ డౌన్
ముంబై: రూపాయి విలువ పెరగడం దేశీయ అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్‌కు దెబ్బకొట్టింది. నేడు ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర జూన్ త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలు తప్పి, క్వార్టర్ క్వార్టర్‌కు 10 శాతం పడిపోయింది. కంపెనీ నికర లాభాలు రూ.5,945 కోట్లగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ నికర లాభాలు ఈ క్వార్టర్‌లో రూ.6,203 కోట్లగా ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు. కానీ విశ్లేషకుల అంచనాలు తప్పాయి.
రెవెన్యూలు సైతం క్వార్టర్ క్వార్టర్‌కు స్వల్పంగా 0.2 శాతం పడిపోయి రూ.29,584 కోట్లగా నమోదయ్యాయి. ఇవి విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వచ్చాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుకు 7 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్టు ఈ ఐటీ దిగ్గజం ప్రకటించింది. ఈ క్వార్టర్‌లో డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ అమాంతం పెరగడంతో రూ.650 కోట్ల మేర నష్టపోయినట్టు కంపెనీ సీఎఫ్‌ఓ రామకృష్ణన్ చెప్పారు.
స్థిరమైన కరెన్సీ విలువల్లో రెవెన్యూ వృద్ధి ఈ క్వార్టర్‌లో 2 శాతం పెరిగింది. వాల్యుమ్ గ్రోత్ కూడా 3.5 శాతానికి పెరిగినట్టు కంపెనీ నేడు బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. గత క్వార్టర్‌లో 29.10 శాతంగా ఉన్న ఈబీఐటీ మార్జిన్లు ఈ క్వార్టర్‌లో 26.6 శాతానికి పడిపోయాయి. 1 మిలియన్ బ్యాండ్‌లో కంపెనీ 8 మంది క్లయింట్లను చేర్చుకోగా... 10 మిలియన్ బ్యాండ్‌లో 12 మంది ఉన్నారు. కంపెనీలో మొత్తం ఉద్యోగులు 3,85,809 మంది ఉండగా, గ్రాస్ అడిక్షన్ కింద 11,202 ఉద్యోగులున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాలు తక్కువగానే ఉంటాయని కంపెనీ చెప్పింది.