టీసీఎస్‌.. అంచనాలు మిస్‌ | TCS reports net profit of Rs 8,042 crore in Q2 results | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌.. అంచనాలు మిస్‌

Published Fri, Oct 11 2019 5:26 AM | Last Updated on Fri, Oct 11 2019 5:46 AM

TCS reports net profit of Rs 8,042 crore in Q2 results - Sakshi

ముంబై: దేశీ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. గురువారం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం 1.8 శాతం వృద్ధి చెంది రూ. 8,042 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 7,901 కోట్లు. ఇక జూలై–సెప్టె ంబర్‌ త్రైమాసికంలో ఆదాయం 5.8% పెరిగి రూ. 36,854 కోట్ల నుంచి రూ. 38,977 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 8.4%గా నమోదైంది.

సాధారణంగా దేశీ ఐటీ సేవల కంపెనీలకు జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం మెరుగ్గా ఉండే నేపథ్యంలో టీసీఎస్‌ ఆదాయ వృద్ధి 9–9.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని, లాభం రూ. 8,304–8,322 కోట్ల మేర ఉండగలదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. రూపాయి మారకం విలువ క్షీణించడం, వీసా ఖర్చులు తగ్గడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ లాభాలు.. అంచనాలకు అనుగుణంగా లేకపోవడం అశ్చర్యకరమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

టీసీఎస్‌ గతంలో ఇచ్చిన రెండంకెల స్థాయి వృద్ధికి రిస్కులు పొంచి ఉన్నాయనడానికి తాజా ఫలితాలు నిదర్శనమని, స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 9 శాతానికి దిగువనే ఉండొచ్చని బ్రోకరేజి సంస్థ ఎమ్‌కే గ్లోబల్‌ పేర్కొంది. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ టీసీఎస్‌తోనే ప్రారంభం కావడంతో.. మిగతా కంపెనీల ఫలితాలెలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. సీక్వెన్షియల్‌గా చూస్తే లాభం 1.09 శాతం క్షీణించింది. జూన్‌ క్వార్టర్‌లో లాభం రూ. 8,131 కోట్లు. మరోవైపు తొలి త్రైమాసికంలో ఆదాయం రూ. 38,172 కోట్లుగా ఉండగా, రెండో త్రైమాసికంలో రూ. 38,977 కోట్లకు చేరింది.

తగ్గిన మార్జిన్లు..
నిర్వహణ పనితీరుకు సంబంధించి వడ్డీలు, పన్నులకు ముందు లాభాలు (ఎబిట్‌) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతం క్షీణించి రూ. 9,361 కోట్లకు చేరగా, మార్జిను 250 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. తొమ్మిది త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 24 శాతానికి పరిమితమైంది. సీక్వెన్షియల్‌గా చూసినా మార్జిను 15 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. సామ ర్థ్యాలను పెంచుకునే దిశగా మరింత ఇన్వెస్ట్‌ చేస్తుండటం మార్జిన్లపై ప్రభావం చూపినట్లు సంస్థ వెల్లడించింది. కాగా, విశ్లేషకులు ఎబిట్‌ రూ. 9,834 కోట్లుగాను, మార్జిను 25 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. కంపెనీ
26–28 శాతం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

సవాళ్లు పొంచి ఉన్నాయ్‌...
ఏడాది ప్రారంభంలో మేం అంచనా వేసిన దానికన్నా ఫలితాలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.   ఆర్థిక సేవలు, రిటైల్‌ విభాగాల్లో ఒడిదుడుకులు తీవ్రంగా పెరిగినప్పటికీ రెండో త్రైమాసికంలో స్థిరంగా వృద్ధి నమోదు చేయగలిగాం. మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా మా సేవలకు డిమాండ్‌ కొనసాగుతుందని ధీమాగా ఉన్నాం. గడిచిన ఆరు త్రైమాసికాల్లోనే అత్యధిక స్థాయిలో ఉన్న క్యూ2లో ఆర్డర్‌ బుక్‌ ఇందుకు నిదర్శనం.  ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సవాళ్లతో కూడుకున్నట్లుగానే కనిపిస్తోంది. పెద్ద సంస్థలు, బ్యాంకులు.. ఐటీ వ్యయాల్లో కోత పెడుతుండటంతో ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్‌ విభాగంలో మందగమనం కొనసాగుతోంది. ఇది ఆర్థిక ఫలితాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పారు. 6.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం లభించే అవకాశాలున్న పలు డీల్స్‌ను రెండో త్రైమాసికంలో కుదుర్చుకున్నాం.                     
– రాజేష్‌ గోపీనాథన్, టీసీఎస్‌ సీఈవో

ఇతర విశేషాలు..
► మొత్తం ఆదాయంలో డిజిటల్‌ సేవల విభాగం వాటా 33.2 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే డిజిటల్‌ ఆదాయం 27.9 శాతం పెరిగింది. అయితే, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గింది.  

► ప్రాంతాల వారీగా యూరప్, ఇంగ్లాండ్‌లో ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉంది. కానీ అమెరికాతో పాటు భారత్, మధ్యప్రాచ్యం, ఆసియా–పసిఫిక్‌ ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి.  

► రెండో క్వార్టర్‌లో ఉద్యోగుల సంఖ్య నికరంగా 14,097 మేర పెరిగింది. మొత్తం సిబ్బంది సంఖ్య 4,50,738కి చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30,000 పైచిలుకు క్యాంపస్‌ నియామకాలు చేపట్టనుంది.  అట్రిషన్‌ రేటు 11.6 శాతంగా ఉంది.  

► ఆదాయాలు కొంత తగ్గడం, కొత్త సిబ్బందిపై భారీ వేతనాల వ్యయాలు తదితర అంశాలు మార్జిన్లపై ప్రభావం చూపినట్లు సంస్థ సీఎఫ్‌వో వి. రామకృష్ణన్‌ చెప్పారు. అయితే, వ్యవస్థాగతంగా సవాళ్లేమీ లేకపోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాపారపరంగా ఇప్పటికే పన్ను మినహాయింపులు ఉన్నందున కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు వల్ల కంపెనీకి కొత్తగా ప్రయోజనాలేమీ ఉండబోవని రామకృష్ణన్‌ పేర్కొన్నారు.

► రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటికి రూ. 5 చొప్పున రెండో విడత మధ్యంతర డివిడెండుతో పాటు రూ. 40 మేర ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించాలని టీసీఎస్‌ బోర్డు నిర్ణయించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్‌ 18. చెల్లింపు తేదీ అక్టోబర్‌ 24.


టీసీఎస్‌ ఆర్థిక ఫలితాలు స్టాక్‌ మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడయ్యాయి. సంస్థ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.86 శాతం క్షీణించి రూ. 2,004 వద్ద క్లోజయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement