హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో తొలిసారిగా బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసేందుకు టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రా, తెలంగాణ ఐటీ శాఖ చేతులు కలిపాయి. నూక్లియస్ విజన్, ఎలెవన్01 ఫౌండేషన్ ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నాయి. ఈ కేంద్రం బ్లాక్‌చైన్ టెక్నాలజీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా, ఇంక్యుబేటర్‌గా పాత్ర పోషించనుంది. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. భారత్‌లో ఈ రంగంలో ఉన్న స్టార్టప్‌లు, కంపెనీలు వేగంగా వృద్ధి చెందేందుకు బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ తోడ్పడనుంది. ఇంటర్నేషనల్ బ్లాక్‌చైన్ కాంగ్రెస్ సందర్భంగా శుక్రవారమిక్కడ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నాని సమక్షంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎలెవన్01 ఫౌండేషన్ సీఈవో రామా అయ్యర్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
సర్టిఫికెట్లకు బ్లాక్‌చైన్..: విద్యార్హత పత్రాల జారీలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగించనున్నట్టు కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. బ్లాక్‌చైన్‌ను ఆసరాగా చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్టు చెప్పారు. ‘‘విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల సమాచారాన్ని బ్లాక్‌చైన్ ఆధారంగా భద్రపరుస్తారు. దీంతో యూనివర్సిటీలు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలతోపాటు ఉద్యోగం ఇచ్చే ప్రైవేటు సంస్థలు విద్యార్థి సమర్పించిన పత్రాలను సరిచూసుకోవచ్చు. చిట్‌ఫండ్ సంస్థల లావాదేవీలను ట్రాక్ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు చేపట్టాం’’ అని వివరించారు.
పట్టణాల్లోనూ ప్రక్షాళన..: అందరు భాగస్వాము లతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వ విభాగాలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశ్రమతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఇవన్నీ బ్లాక్‌చైన్ రంగం వృద్ధికి, ఈ రంగ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రముఖ కేంద్రంగా తెలంగాణ నిలిచేందుకు దోహదం చేస్తాయని వివరించారు. ధరణి పేరుతో 568 మండలాల్లో 10,875 గ్రామాల్లో ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన చేపట్టి, ఆ సమాచారాన్ని బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భద్రపరిచామని పేర్కొన్నారు. పట్టణాల్లోనూ ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment