
టెక్ మహీంద్రా లాభం జూమ్
క్యూ3లో 14% అప్; రూ.856 కోట్లు
ఆదాయం రూ.7,558 కోట్లు; 13% వృద్ధి
గ్లోబల్ డిజిటలైజేషన్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం...
కంపెనీ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్
న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో రూ.856 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం (రూ.751 కోట్లు)తో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా తెలిపింది. గత క్యూ3లో రూ.6,701 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 13 శాతం వృద్ధితో రూ.7,558 కోట్లకు చేరిందని కంపెనీ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. ఈ క్వార్టర్‌లో మంచి డీల్స్ సాధించామని, వ్యాపారం జోరుగా ఉందని వివరించారు. అంతర్జాతీయ డిజిటలైజేషన్ కార్యకలాపాల్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకునే స్థాయిలోనే ఉన్నామనడానికి తాము సాధించిన డీల్స్, జోరుగా ఉన్న వ్యాపారమే నిదర్శనాలని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 11 శాతం వృద్ధితో 13 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 112 కోట్ల డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు.
4,209 కొత్త ఉద్యోగాలు...
ఈ క్యూ3లో ఐటీ ఆదాయం రూ.7,031 కోట్లు, బీపీఓ ఆదాయం రూ.526 కోట్లకు పెరిగినట్లు వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. ఐటీ ఆదాయంలో అమెరికా వాటా 47 శాతం, యూరోప్ వాటా 29 శాతం, ఇతర దేశాల వాటా 24 శాతంగా ఉందని వివరించారు. ఈ క్యూ3లో కొత్తగా 4,209 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, గత ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,17,095గా ఉందని, వీరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంఖ్య 80,858 అని తెలిపారు. ఉద్యోగుల వలస 18 శాతంగా ఉందని చెప్పారు.
రూ.4,951 కోట్ల నగదు నిల్వలు..
ఈ క్యూ3లో అదనంగా చేరిన రూ.950 కోట్ల నగదుతో కలుపుకొని నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.4,951 కోట్లుగా ఉన్నాయని నయ్యర్ చెప్పారు. ఈ క్యూ3లో కొత్తగా 12 క్లయింట్లు లభించారని, మొత్తం క్లయింట్ల సంఖ్య 837కు పెరిగిందని తెలిపారు. నికర లాభం 14 శాతం పెరిగిన నేపథ్యంలో బీఎస్‌ఈలో టెక్ మహీంద్రా షేర్ 1 శాతం లాభపడి రూ.471 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌రూ.483 కోట్లు పెరిగి రూ.45,903 కోట్లకు చేరింది.