సాక్షి, బెంగళూర్ : దిగ్గజ కంపెనీలకు చెందిన ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డీ విభాగాల్లో అధిక వేతన పెంపు, నియామకాల జోరు ఊపందుకుంటుందని కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ తాజా అథ్యయనంలో వెల్లడైంది. టెక్నాలజీ రంగంలో గత ఏడాది హైరింగ్ 29 శాతం పైగా పెరిగింది. దేశవ్యాప్తంగా పలు ఎంఎన్‌సీలకు చెందిన 43 గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్లలో (జీఐసీ) ఈ అథ్యయనం చేపట్టారు. దేశంలో 1200 ఆర్‌అండ్‌డీ, ఇంజనీరింగ్ సెంటర్లతో 950 ఎంఎన్‌సీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో 5 నుంచి 10 శాతం మేరకు పెరుగుతోంది. జీఐసీలో హైరింగ్ ఐటీ నియామకాల కంటే అధికంగా ఉండటం గమనార్హం. 2017లో జీఐసీల్లో వేతన పెంపు భారత ఐటీ కంపెనీల వేతన పెంపు కంటే రెండు రెట్లు అధికమని అథ్యయనంలో వెల్లడైంది.
జీఐసీల్లో సగటు వేతన పెంపు 11.2 శాతంగా నమోదైంది. జూనియర్ లెవెల్‌లో అత్యధికంగా 14 శాతం వరకూ వేతనాలు పెరిగాయి. క్లౌడ్, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ వంటి నూతన డిజిటల్ టెక్నాలజీల రాకతో బహుళజాతి సంస్థలు తమ ఇంజనీరింగ్ విభాగాల్లో నైపుణ్యాలను పెంచుకోవడం, నూతన సొల్యూషన్లపై దృష్టిసారించడంతో ఆయా విభాగాల్లో నియామకాలు పెరిగాయని జిన్నోవ్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్, డెలివరీ హెడ్ ఆనంద్ సుబ్రమణియమ్ చెప్పారు. మరోవైపు పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగాల్లో హైరింగ్ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. 2017లో ఆర్‌అండ్‌డీలో 30.6 శాతం మేర హైరింగ్ వృద్ధి నమోదైందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment