ట్రెడా షో ప్రారంభం
నేడు, రేపు కూడా అందుబాటులో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్థిరాస్తి కొనుగోలు అంటే మామూలు విషయం కాదు. స్థలం కొనుగోలు నుంచి అందమైన ఇల్లు కట్టుకునే వరకు అన్నీ దగ్గరుండి చూసుకోవాలనుకుంటారు. దీని కోసం ఎక్కడెక్కడో తిరిగి వివరాలు సేకరించే సమస్య లేకుండా అన్ని వివరాలు ఒకే చోట లభ్యమయ్యేలా తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అవకాశం కల్పిస్తోంది. మూడు రోజుల ప్రాపర్టీ షో మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైంది.
ప్రదర్శనలో 180 స్టాళ్లు: నగదు పొదుపు నుంచి బ్యాంకులు అందించే రుణ సదుపాయాల వరకు అన్నింటి సమాచారం ఈ షో అందిస్తుంది. రియల్టర్లను, డెవలపర్లను, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కొనుగోలుదారులకు నాణ్యమైన ఇళ్లను అందించడమే ఈ ప్రాపర్టీ షో లక్ష్యమని ట్రెడా అధ్యక్షులు దశ్థ్‌ర్రెడ్డి చెప్పారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మెటీరియల్ తయారీదారులు, ఇంటీరియర్ డిజైనర్లు, బ్యాంకులు వంటి ఎన్నో సంస్థలు పాల్గొనే ఈ ప్రాపర్టీషోలో డెవలపర్లు 180 స్టాళ్ల ద్వారా వారి వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇప్పటికే 40 వేల సందర్శకులు వారి పేర్లను నమోదుచేసుకున్నారు. ప్రవేశం ఉచితం. ఈ అవకాశాన్ని నగరవాసులతోపాటు, ప్రవాసాంధ్రులు, నగరంలో నివసిస్తున్న ఇతర జిల్లాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. లక్కీ డిప్ విజేతగా ఆర్. మహేష్ (కూపన్ నంబర్: 35476) మారుతీ ఆల్టో కారును గెలుచుకున్నాడు.
ఇంటి శోభ: ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇటీవల అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని కోసం ఆర్కిటెక్చర్లపైన ఆధారపడుతున్నారు. అందమైన ఏవియేషన్ ఆపై చక్కని గాలి వెలుతురు వచ్చేలా ఇంటి డిజైన్ రూపొందించడంలో ఆర్కిటెక్చర్లదే ప్రధాన పాత్ర. దీనికోసం స్థిరాస్తి వ్యాపారులు ఆర్కిటెక్చర్లతో అపార్ట్‌మెంట్లు, డ్యూప్లెక్స్ నిర్మాణాలు, విల్లాలకు డిజైన్లు చేయిస్తున్నారు. మదిని దోచే ముచ్చటైన రూపాలను అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు.