విమాన షేర్లు.. టేకాఫ్!
ఐదు రోజుల్లో 45 శాతం పెరిగిన ఎయిర్‌లైన్స్ షేర్లు
దిగొస్తున్న క్రూడ్ ధరలతో లాభాల బాట పడతాయన్న నమ్మకం
రెండు నెలల్లో 15 శాతం తగ్గిన విమాన ఇంధన ధరలు
ఆఫర్లతో పెరుగుతున్న ప్రయాణికులు
ఝున్‌ఝున్‌వాలా వాటా కొన్న వార్తలతో 16% పెరిగిన స్పైస్ జెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా భారీ నష్టాలతో సతమతమైన దేశీయ విమానయాన రంగానికి మంచి రోజులు రాబోతున్నాయా? అంతర్జాతీయంగా తగ్గుతున్న ఇంధన ధరలు దీనికి అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి. గత మూడు నెలల్లో 10 శాతం తగ్గిన విమాన ఇంధన ధరలు తాజాగా మరో 4 శాతం తగ్గాయి. దీంతో గత మూడు నెలల్లో ఇంధన ధరలు 14 శాతం దిగిరావడంతో విమానయాన సంస్థలు సంతోషంలో ఉన్నాయి.
సెప్టెంబర్ నెలలో కిలో లీటరు విమాన ఇంధన ధర రూ.70.04గా ఉంటే అది ఇప్పుడు రూ. 59,94కి పడిపోయింది. ఒపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిని తగ్గించకూడదని నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్న విషయం విదితమే. విమానాల నిర్వహణా వ్యయంలో అత్యధిక శాతం 40 నుంచి 50 శాతం ఇంధనానిదే ఉండటంతో ధరల తగ్గుదల ఈ రంగానికి పెద్ద ఊరటినిస్తుందంటున్నారు.
తగ్గనున్న నష్టాలు...
గత ఆర్థిక ఏడాదిలో దేశీయ విమానయాన సంస్థలన్నింటికీ కలిపి సుమారు రూ. 10,600 కోట్ల నష్టాలు వస్తే, ఇంధన ధరల తగ్గింపు వల్ల ఈ నష్టాలు రూ. 8,000 కోట్లకు తగ్గుతాయని ఆసియా పసిఫిక్ ఏవియేషన్ సంస్థ అంచనా వేసింది. లాభాల్లో నడుస్తున్న ఏకైక విమానయాన సంస్థ ఇండిగో గతేడాది ఇంధన వ్యయం రూ.5,500 కోట్లుగా ఉందని, ఇంధన ధరలు తగ్గడం వల్ల సుమారు రూ. 350 కోట్ల ప్రయోజనం లభించనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలకు ఈ ఏడాది నష్టాలు భారీగా తగ్గనున్నాయి.
గతంలో 10 శాతం ఇంధన ధరలు తగ్గినప్పుడే స్పైస్ జెట్ రూ. 320 కోట్ల ప్రయోజనం లభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది స్పైస్ జెట్ ఇంధన బిల్లు రూ. 3,252 కోట్లు ఉంటే నష్టాలు రూ.1,003 కోట్లుగా ఉన్నాయి. ప్రపంచంలోనే విమాన టికెట్ల ధరలు ఇండియాలోనే తక్కువగా ఉండటంతో టికెట్ల ధరలు ఇంత కంటే తగ్గే అవకాశం లేదని, ఈ తగ్గింపుతో నష్టాలను పూడ్చుకోనున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి.
షేర్ల ధరల జోరు...
ఇంధన ధరలు తగ్గుతుండటంతో కంపెనీల లాభాలు పెరిగే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు విమానయాన కంపెనీల షేర్లపై దృష్టిసారిస్తున్నారు. దీనికితోడు దేశీయ అతిపెద్ద ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నష్టాల్లో ఉన్న స్పైస్ జెట్‌లో వాటా పెంచుకున్నారన్న (75 లక్షల షేర్ల కొనుగోలు) వార్తలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని మరింత పెంచింది. దీంతో గత ఐదు రోజుల్లో ఈ రంగ షేర్లు 45 శాతం పైగా పెరిగాయి. జెట్ ఎయిర్‌వేస్ షేరు 47 శాతం వృద్ధితో రూ. 241 నుంచి రూ. 354కు పెరిగితే, స్పైస్ జెట్ షేరు 45 శాతం వృద్ధితో రూ. 14.75 శాతం నుంచి రూ. 21.40కి చేరింది.
కష్టాల్లో ఉన్న ఈ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం కొత్త ఏవియేషన్ పాలసీ రూపొందిస్తుండటం, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం, ఇంధన ధరలు తగ్గుతుండటంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై ఆసక్తి చూపిస్తున్నారని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి అన్నారు. ప్రస్తుతానికి ఆశాజనకంగానే ఉన్నా... కొత్త కంపెనీలు ప్రవేశిస్తుండటంతో రానున్న కాలంలో కంపెనీల మధ్య ఉండే ధరల యుద్ధంపై షేర్ల ధరలు కదులుతాయన్నారు.
గత కొంత కాలంగా దేశీయ విమానయాన సంస్థలు చౌకటికెట్ల ఆఫర్లు ప్రయాణికులను ఆకర్షించడంలో సఫలమయ్యాయి. స్పైస్‌జెట్ లోడ్ ఫ్యాక్టర్ 69 శాతం నుంచి 82 శాతానికి చేరితే, జెట్ ఎయిర్‌వేస్‌ది 77 శాతం నుంచి 79 శాతానికి పెరిగింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడితే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా.