హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నిర్వహిస్తున్న విమాన సర్వీస్‌ను స్పైస్‌జెట్ ఈ నెల 1 నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ మార్గంలో విమాన సేవలను కంపెనీ రెండు నెలల క్రితం ప్రారంభించింది. వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్‌జెట్ విమానాలు నడిపింది. అయితే ప్రస్తుతం తగినంత గిరాకీ లేకపోవడంతో, ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
స్పైస్‌జెట్ అయోధ్యకు తన మొదటి విమానం SG 611 ఏప్రిల్ 2న ప్రారంభించింది. ఇది ఆ రోజు ఉదయం 10.45 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి 12:45 గంటలకు అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ తరువాత తిరుగు ప్రయాణంలో SG 616 అయోధ్య నుంచి 1 గంటకు బయలుదేరి 3:25 pmకి తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. ఈ విధంగా వారంలో మూడు సార్లు స్పైస్‌జెట్ ఈ సర్వీస్ కొనసాగించింది.
మార్చి 31న, అప్పటి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి, హైదరాబాద్, అయోధ్యలను అనుసంధానించాలని అభ్యర్థిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రికి రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ - అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసు లేకపోవడం భక్తులకు ఓ సవాలుగా మారిందని పేర్కొన్నారు.
ఫిబ్రవరి నాటికి స్పైస్‌జెట్ ఎనిమిది భారతీయ నగరాలను అయోధ్యకు సర్వీస్ ప్రారంభించింది. ప్రస్తుతం స్పైస్‌జెట్ అహ్మదాబాద్, ఢిల్లీల నుంచి అయోధ్యకు నేరుగా విమానాలను నడుపుతోంది. అయోధ్య రామమందిరం ప్రారంభమైన తరువాత వేగంగా పుంజుకున్న పర్యాటకం క్రమంగా క్షిణించింది. దీంతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గింది. స్పైస్‌జెట్ తన సర్వీసులను కూడా తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment