యుద్ధం కత్తితో కాదు.. కరెన్సీతో | The battle is not with the knife with the currency .. | Sakshi
Sakshi News home page

యుద్ధం కత్తితో కాదు.. కరెన్సీతో

Published Thu, Aug 13 2015 7:55 AM | Last Updated on Mon, Aug 13 2018 3:34 PM

యుద్ధం కత్తితో కాదు.. కరెన్సీతో - Sakshi

యుద్ధం కత్తితో కాదు.. కరెన్సీతో

యువాన్ విలువ వరసగా రెండుసార్లు తగ్గించిన చైనా
అంతర్జాతీయంగా తన ఉత్పత్తుల డిమాండ్ పెంపే లక్ష్యం
దాంతో పోటీ పడాలంటే మిగతా దేశాలూ తగ్గించాల్సిందే
ఆర్‌బీఐ చర్యలతో రెండేళ్ల కనిష్ఠానికి పతనమైన రూపాయి
మేకిన్ ఇండియా నెరవేరాలన్నా;తయారీ రంగం వృద్ధి చెందాలన్నా ఇది తప్పదు...
 
 సాక్షి, బిజినెస్ విభాగం : రచయిత సాల్మన్ రష్దీ చెప్పినట్లు... ఇదివరకు యుద్ధం జరిగితే దాన్లో భాగస్తులు కాని వారంతా దూరంగా ఏదో కొండెక్కి చూసే వీలుండేది. కానీ ఇపుడు జరుగుతున్న ఆర్థిక యుద్ధాలను ఆ రకంగా చూసే వీలులేదు. ఎందుకంటే ఈ యుద్ధాల్లో అసలు పాల్గొనని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా... అది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక గ్రీసు ఒకవేళ దివాలా తీసి ఉంటే దాంతో వాణిజ్యం చేసే దేశాలన్నీ అతలాకుతలమయ్యేవి. అందుకే యూరో దేశాలన్నీ కలిసి కొత్త అప్పులిచ్చి మరీ దాన్ని గట్టెక్కించాయి.

 ఇపుడు చైనా వంతు. కొన్నేళ్లుగా చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన తీరు ప్రపంచదేశాలన్నిటికీ పాఠ్యాంశమే. ఏ వస్తువునైనా తయారు చేసి, యావత్ ప్రపంచానికీ ఎగుమతి చేస్తూ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందీ డ్రాగన్. దీంతో చైనీయుల జీతాలు, జీవితాలు కూడా మారాయి. చైనా కరెన్సీ యువాన్ సైతం బాగా బలపడింది. పదేళ్ల కిందట డాలరుతో యువాన్ మారకం విలువ 8.27. ఇపుడది ఏకంగా 30 శాతానికి పైగా వృద్ధి చెంది 6.33కు చేరింది. అయితే ఇక్కడ గమనించాల్సిందొకటి ఉంది.

చైనా ఉత్పత్తులకు యువాన్లలోనే రేటు నిర్ణయిస్తారు. మరి ప్రపంచవ్యాప్తంగా దేశాలను ముంచెత్తుతున్న చైనా ఉత్పత్తులన్నీ యువాన్ బలపడితే ఖరీదెక్కువైనట్టే కదా!!. అపుడు డిమాండ్ తగ్గుతుంది. మరి ఎగుమతులపైనే ప్రధానంగా ఆధారపడ్డ చైనా ఆర్థిక వ్యవస్థ డిమాండ్ తగ్గితే ఏమవుతుంది? ఇదిగో ఈ సమస్యను ఎదుర్కోవటానికే చైనా కరెన్సీ యుద్ధానికి తెరతీసింది. గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా తన కరెన్సీ విలువను రెండు రోజుల్లో ఏకంగా 3.6 శాతం కోత కోసేసింది. తన ఉత్పత్తులను మిగతా దేశాలకంటే తక్కువ ధరకు అందించడానికి ఈ చర్య తీసుకుంది.

 మిగతా దేశాలదీ అదే బాట...
 నిజానికి చైనా తన కరెన్సీ విలువను కోసేయటంతో ప్రపంచం నివ్వెరపోయింది. తాము ఊహిస్తున్నదానికన్నా చైనా ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందేమోనన్న భయాలు ఆర్థిక మార్కెట్లను వెన్నాడాయి. అందుకే రెండు రోజులుగా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇక చైనా కరెన్సీ కోతతో దాని ప్రధాన దిగుమతుల్లో ఒకటైన ఇంధన బిల్లు మరింత భారమయ్యే అవకాశముంది. దీనివల్ల విమాన కంపెనీల లాభాలు పడిపోతాయన్న ఆందోళనతో ఎయిర్ చైనా సహా ఆ రంగంలోని కంపెనీల షేర్లు దారుణంగా పతనమయ్యాయి. నిజానికిపుడు చైనా కరెన్సీ విలువ కోత వల్ల భారత్‌తో సహా దాంతో వస్తువుల విషయంలో పోటీపడే దేశాలన్నీ వాటి విలువల్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఆ చర్యల ఫలితమేనేమో...
 యూరోపియన్ యూనియన్, జపాన్, కొరియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ల కరెన్సీలు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ప్రపంచ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఇప్పటివరకూ మన కరెన్సీ పటిష్టంగా నిలవడానికి డాలర్లు ఖర్చుచేస్తూ వస్తున్న రిజర్వు బ్యాంక్ కూడా రెండు రోజులుగా రూపాయి పడిపోయేందుకు బాట వేసింది. దాంతో ఇది రెండేళ్ల కనిష్ట స్థాయికి పతనమైపోయింది. మన టెక్స్‌టైల్స్, జ్యువెల్లరీ తదితర తయారీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో  చైనాతో పోటీ పడాలంటే రూపాయి క్షీణించక తప్పదు. లేనిపక్షంలో తయారీదారులకు తగిన ప్రోత్సాహకాలిచ్చి ఆదుకోవాలి. అలా చేసేంత బలం మన ఆర్థిక వ్యవస్థకు లేదు కనక ఆర్‌బీఐ రూపాయి క్షీణతకు బాటవేసింది. కరెన్సీ బలంగా వుంటే ‘మేక్ ఇన్ ఇండియా’ ఆశ నెరవేరే అవకాశమూ తక్కువే.

 ఆర్‌బీఐకి కత్తిమీద సామే...
 మిగతా దేశాల కేంద్ర బ్యాంకులతో పోలిస్తే మన రిజర్వు బ్యాంక్‌కు రూపాయిని బ్యాలెన్స్‌డ్‌గా నిలపడం అత్యవసరం. ఎందుకంటే ఎక్కువగా ముడి చమురు, బంగారం దిగుమతులపై ఆధారపడిన దేశం మనది. రూపాయిని మరీ ఎక్కువ క్షీణింపచేస్తే దిగుమతుల బిల్లు పెరిగిపోయి పెనుభారమవుతుంది. ఆర్థిక వ్యవస్థ చితికిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి, తిరిగి ద్రవ్యోల్బణం ఎగిసిపోతుంది. అలాగని కరెన్సీని పెర గనిస్తే అధికశాతం మందికి ఉపాధి కల్పించే తయారీ రంగం కుప్పకూలుతుంది. అందుచేత ఆర్‌బీఐ ఈ కరెన్సీ యుద్ధంలో ఆచితూచి పాల్గొనాల్సి ఉంటుంది.
 
 చైనా ‘యువాన్’.. కోత మీద కోత
 బీజింగ్: చైనా సెంట్రల్ బ్యాంక్.. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) ప్రపంచ స్టాక్, కమోడిటీ మార్కెట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వరుసగా రెండో రోజూ డాలరుతో తమ దేశ కరెన్సీ యువాన్ మారకం విలువకు కోత(డీవేల్యూ) పెట్టింది. దీంతో ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా చైనా బాటనే అనుసరించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, బుధవారం పీబీఓసీ యువాన్ విలువను మరో 1.6% నుంచి 6.33కి  తగ్గించింది. మంగళవారంనాటి 2 శాతం తగ్గింపుతో కలుపుకొని రెండు రోజుల్లోనే 3.6% కోత విధించినట్లయింది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనా.. 1994 తర్వాత తమ దేశ కరెన్సీ విలువను ఇంత భారీగా తగ్గిండచం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, ఈ చర్యలను పీబీఓసీ సమర్థించుకుంది. కరెన్సీమారకం విలువకు సంబంధించి మార్కెట్ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేసేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని.. ఇది వన్‌టైమ్ సర్దుబాటేనని పేర్కొంది. అంటే ప్రధాన విదేశీ కరెన్సీలకు డిమాండ్, సరఫరాను పరిగణనలోకి తీసుకొని క్రితం రోజు ముగింపు ఆధారంగా యువాన్ మారకం విలువ రోజువారీ రిఫరెన్స్ రేటును  పీబీఓసీ ప్రకటిస్తుంది. దీని ఆధారంగానే కరెన్సీ ట్రేడింగ్ జరుగుతుంది. కాగా, పీబీఓసీ చర్యలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) స్వాగతించింది. ఎక్స్ఛేంజ్ రేటు నిర్ణయంలో మార్కెట్ వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది.
 
యువాన్ దెబ్బకు రూపాయి విలవిల
59 పైసలు క్షీణత; 64.78 వద్ద ముగింపు 
రెండేళ్ల కనిష్ట స్థాయి
ముంబై : చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గింపు ప్రకంపనలతో అటు స్టాక్, ఇటు కరెన్సీ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ వరుసగా ఐదో రోజూ పతనబాటలోనే కొనసాగింది. బుధవారం ఈ పతన తీవ్రత మరింత పెరిగింది. దేశీ కరెన్సీ ఏకంగా 59 పైసలు క్షీణించి 64.78 స్థాయికి పడిపోయింది. ఇది రెండేళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం. మొత్తంమీద ఆరు రోజుల్లో రూపాయి విలువ 104 పైసలు(1.63%) ఆవిరైంది. యువాన్ విలువ తగ్గింపు ప్రభావంతో అంతర్జాతీయంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం విలువ పుంజుకోవడం రూపాయి పతనానికి దారితీసినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, దిగుమతిదారులు, బ్యాంకర్ల నుంచి డాలరుకు డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనబాట కూడా రూపాయి నేలచూపులకు కారణమేనని వారు అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందని.. 65.60 వరకూ పడిపోవచ్చనేది కొంతమంది ఆర్థికవేత్తల అంచనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement