ఎయిర్‌సెల్ నుంచి కొత్త డేటా ప్యాకేజీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తక్కువ ధరకే అందుబాటు శ్రేణిలో అపరిమిత 3జీ ఇంటర్నెట్ డేటా ప్యాక్‌లను ఎయిర్‌సెల్ ప్రవేశపెట్టింది. స్మార్ట్‌ఫోన్లతో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగా డేటా ప్యాక్‌లను రూపొందించినట్లు ఎయిర్‌సెల్ నేషనల్ హెడ్ (డేటా) సునీల్ కుట్టమ్ తెలియజేశారు. రూ.9 నుంచి రూ.403 శ్రేణిలో అపరిమిత డేటా ప్యాకేజీలను ప్రవేశపెట్టిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.
రూ.9 ప్యాకేజీతో రోజుకు 100 ఎంబీ 3జీ సర్వీసులను వినియోగించుకోవచ్చని, ఈ పరిమితి తర్వాత తక్కువ ఇంటర్నెట్ వేగంతో సర్వీసులు నిరాటంకంగా వినియోగించుకోవచ్చని తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజాలు మార్టినా హింగిస్, విజయ్ అమృతరాజ్ చేతులు మీదుగా కొత్త డేటా ప్యాకేజీలను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు.
ఈ సం దర్భంగా సునీల్ మాట్లాడుతూ ఇప్పటికీ దేశంలో 80 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదని, వారంతా కొత్త వినియోగదారులుగా చేరుతుండటంతో ఈ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతోందని తెలియజేశారు. ప్రస్తుతం 40 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తూ అమెరికాను అధిగమించినట్లు తెలిపారు. ఎయిర్‌సెల్ ఆదాయం లో 18% డేటా నుంచి సమకూరుతోందన్నారు.