ఫలితాలు, పార్లమెంటుపై దృష్టి
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా
♦ జాబితాలో ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల ఫలితాలు
♦ పార్లమెంటు ముందు కీలక బిల్లులు..
న్యూఢిల్లీ : బ్లూచిప్ కంపెనీలైన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల ఫలితాలు, కీలక బిల్లులపై వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో జరిగే చర్చల ఆధారంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. ఈ అంశాలే కాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రీతి, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు, చమురు ధర తదితర అంశాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారన్నారు. ముఖ్యంగా జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక ఫలితాలు ట్రెండ్‌పై ప్రభావాన్ని చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వికాస్ సింఘానియా చెప్పారు. హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, లుపిన్, విప్రో, యాక్సిస్ బ్యాంక్‌ల ఫలితాలు సైతం ఈ వారమే వెల్లడికానున్నాయి. వచ్చే ఏడాదికి ఆయా కంపెనీలు ప్రకటించే గెడైన్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి అధికంగా వుంటుందన్నారు.
21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఏర్పడే రాజకీయ పరిణామాల్ని, ప్రధానంగా భూసేకరణ బిల్లు, జీఎస్‌టీ బిల్లుల భవితవ్యాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. భూసేకరణ, జీఎస్‌టీ బిల్లుల్ని పార్లమెంటు ఆమోదిస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో వున్నాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన సంస్కరణలకంటే ఇవి రెండూ అత్యంత కీలకమని ఆయన అన్నారు.
గతవారం మార్కెట్: ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 802 పాయింట్ల పెరుగుదలతో 28,463 పాయింట్ల వద్దకు చేరింది. ప్రధానంగా ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎఫ్‌ఎంసీజీ షేరు ఐటీసీల అప్‌ట్రెండ్ ఫలితంగా స్టాక్ సూచీలు మూడు నెలల గరిష్టస్థాయికి చేరాయి.
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు బిలియన్ డాలర్లు
ఈ నెలలో ఇప్పటివరకూ భారత్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు చేసిన పెట్టుబడులు బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా విదేశీ పెట్టుబడుల పరిమితిని సరళీకరించడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్లో జూలై 1-17 తేదీల మధ్య 4,953 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 1,547 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. దీంతో వారి మొత్తం పెట్టుబడుల విలువ రూ. 6,500 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.