2018కల్లా 5 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ వ్యాపార విస్తరణపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం భారీ ఎత్తున కొత్త శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ (కాసా)పై దృష్టిసారిస్తున్నట్లు విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్.రామారావు తెలిపారు. హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన 1,550 శాఖను రామారావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే నాలుగు నెల్లో మరో 150 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మార్చి నాటికి మొత్తం శాఖల సంఖ్యను 1,700కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రస్తుతం 135 శాఖలు ఉండగా, వచ్చే 16 నెలల్లో కొత్తగా 65 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో రూ. 15,000 కోట్లుగా ఉన్న వ్యాపారం ఈ ఏడాది చివరి నాటికి రూ. 17,000 కోట్లకు చేరుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న శాఖలు, సగటున ఏటా పదవీ విరమణ చేస్తున్న 600 మందిని దృష్టిలో పెట్టుకుంటే 1500 నుంచి 2,000 మంది కొత్త సిబ్బందిని తీసుకోవాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మూలధన ఇబ్బందులు లేవు
బాసెల్ 3 నిబంధనల ప్రకారం మూలధనానికి ఎటువంటి ఇబ్బందులు లేవని, త్వరలోనే టైర్-1, టైర్-2 క్యాపిటల్ కింద రూ.1,100 కోట్లు సమీకరించనున్నట్లు రామారావు తెలిపారు. బాగా పతనమైన షేరు ధర కొద్దిగా పెరిగిన తర్వాత క్విప్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. గత నెలలో టైర్ 2 బాండ్స్ కింద రూ. 500 కోట్లు సేకరించింది. కిందటి నెలలో బ్యాంకులో ప్రభుత్వ వాటా 74 శాతం ఉంటే టైర్-2 బాండ్స్ ఇష్యూ తర్వాత 68 శాతానికి తగ్గిందని, ఇది క్విప్ ఇష్యూ తర్వాత 58 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోనున్నట్లు ప్రకటించడంతో, వారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఫాలోఆన్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గినా ఆర్‌బీఐ వెంటనే వడ్డీరేట్లు తగ్గిస్తుందని భావించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించడం, కాసా అకౌంట్లపై దృష్టిపెట్టడం ద్వారా లాభదాయకతను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 19 శాతంగా ఉన్న కాసా డిపాజిట్లు మార్చి, 2015 నాటికి 22 శాతానికి చేరుకుంటుందన్నారు.
పీఎస్‌యూ బ్యాంకుల్లోనే అత్యల్ప ఎన్‌పీఏలు కలిగి ఉన్న బ్యాంకుగా విజయాబ్యాంకు రికార్డులకు ఎక్కిందని, ప్రస్తుతం రూ. 2,239 (2.85%) కోట్లుగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులను ఈ ఆర్థిక ఏడాది చివరి నాటికి రూ. 2,100 కోట్లకు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కింద అందరికీ బ్యాంక్ అకౌంట్లను కల్పించడంపై దృష్టిసారించడంతో పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనాలకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు.