
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
రెండు రోజుల నష్టాల నుంచి గురువారం స్టాక్ మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ,
సెన్సెక్స్ 85 పాయింట్లు అప్
ముంబై: రెండు రోజుల నష్టాల నుంచి గురువారం స్టాక్ మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, కొన్ని బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో రియల్టీ, లోహ, వాహన, బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంతో 27,860 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 8,592 పాయింట్ల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్, గ్యాస్, విద్యుత్తు, ఇన్‌ఫ్రా, ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 27,697 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్ల కారణంగా నష్టాలన్నింటిని పూడ్చుకొని 27,902 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. 205 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 85 పాయింట్ల లాభంతో ముగిసింది. వరుసగా రెండు రోజుల పతనం కారణంగా షేర్ల ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో కొనుగోళ్ల జోరు పెరిగిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ చెప్పారు.