‘సెక్యూరిటీ’ కోల్పోతున్న ఏజెన్సీలు!
♦ నోట్ల రద్దుతో 10% ఆదాయం డౌన్
♦ ఇప్పుడు జీఎస్‌టీతో మరో ముప్పు
♦ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల ఆందోళన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో 10% ఆదాయం కోల్పోయిన ఏజెన్సీలకు ఇప్పుడు జీఎస్‌టీ రూపంలో మరో ముప్పు వచ్చి పడింది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సేవలు పొందే కంపెనీలు ఇప్పుడు 18% జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంది. ఈ భారంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గార్డుల సంఖ్య కుదించాల్సిందిగా పలు కంపెనీలు, సంస్థల నుంచి ఏజెన్సీలకు సమాచారం వస్తోంది. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది వరకూ గార్డులకు కోత పడే అవకాశాలున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, ఎక్సెల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండీ సి.భాస్కర్ రెడ్డి బుధవారమిక్కడ చెప్పారు. ఇదే జరిగితే ఏజెన్సీల ఆదాయం మరింత తగ్గనుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వేల పైచిలుకు ఏజెన్సీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలపైనే..: పెద్ద నోట్ల రద్దుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీలు ఎక్కువగా నష్టపోయినట్లు భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా 50 లక్షల మంది గార్డులుండేవారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 4 లక్షలుండేది. పెద్ద నోట్లు రద్దయ్యాక ఏటీఎంలు భారీగా మూతపడటం, బ్యాంకుల వ్యయ నియంత్రణతో గార్డుల సంఖ్య దేశవ్యాప్తంగా 10%, తెలుగు రాష్ట్రాల్లో 15% తగ్గింది. ఆ మేరకు ఏజెన్సీలు ఆదాయం కోల్పోయాయి. క్యాష్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు కోలుకోలేని దెబ్బ పడింది. ఆర్మ్‌డ్ గార్డులకూ పనిలేకుండా పోయింది. ఇప్పుడు గార్డుల కనీస వేతనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.10 వేలకు అటూ ఇటూ ఉంది. గార్డుల్లో అత్యధికులు అస్సాం, ఒడిషా, బిహార్‌లకు చెందిన వారే. కర్ణాటకలో గార్డుల కనీస వేతనం ఇటీవలే రూ.15,000లకు చేరింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నవారు ఎక్కువ వేతనం వచ్చే ప్రాంతానికి వెళ్లడం ఖాయం. ఇలా అన్నివిధాలా ఇక్కడి ఏజెన్సీలు నష్టపోతున్నాయి’ అని వివరించారు.
కొత్త ఏజెన్సీల జాడే లేదు..: సెక్యూరిటీ సేవల్లోకి గతంలో నెలకు 50 ఏజెన్సీల దాకా పుట్టుకు వచ్చేవి. డీమోనిటైజేషన్ దెబ్బకు కొత్తగా ఒక్కటీ రాలేదని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు కొత్తవారు భయపడుతున్నారని చెప్పారు. కాగా, సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకున్న కంపెనీలు, సంస్థలపై జూన్ 30 వరకు సర్వీస్ ట్యాక్స్ 15 శాతం ఉండేది. ఇప్పుడిది 18 శాతానికి చేరింది. అయితే స్థూల వేతనంపైన కాకుండా సెక్యూరిటీ ఏజెన్సీలు వసూలు చేసే సర్వీస్ చార్జ్‌పైన జీఎస్‌టీ విధించాలని అసోసియేషన్ ట్రెజరర్, ట్రాన్స్‌పరెంట్ కార్పొరేట్ సర్వీసెస్ మేనేజింగ్ పార్ట్‌నర్ ఎన్.వి.సత్యానందం తెలిపారు.