Private Security Agency
-
ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక నగరం ముంబైతోపాటు ఉప నగరాలలో, శివారు ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, ఇతర ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించాలని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయం తీసుకుంది. మూడు సంవత్సరాల కాలవ్యవధి కోసం సంబంధిత కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వనుంది. సుమారు 400పైగా సెక్క్యురిటీ గార్డులతో కూడిన బృందాన్ని రంగంలోకి దించనుంది. అందుకు ఎమ్మెమ్మార్డీయే సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేయనుందని అథారిటీ వర్గాలు తెలిపాయి. (మహారాష్ట్రలో జైళ్లు ఫుల్) 4,350 చదరపు కిలోమీటర్లు.. ఎమ్మెమ్మార్డీయే పరిధి సుమారు 4,350 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో ముంబై, థానే, నవీముంబై, కల్యాణ్–డోంబివలి, ఉల్లాస్‌నగర్, మీరా–భాయందర్, భివండీ, వసయి–విరార్ తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే అంబర్నాథ్, బద్లాపూర్, మాథేరాన్, కర్జత్, ఖోపోలి, పన్వేల్, పేణ్, ఉరణ్, అలీబాగ్ తదితర మున్సిపాలిటీలు, వీటి పరిధిలోని కొన్ని గ్రామాలున్నాయి. ముంబైలో బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్ (బీకేసీ), వడాల, ఓషివరా, గోరాయి తదితర ప్రాంతాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు విలువచేసే సొంత స్థలాలున్నాయి. వీటిపై నియంత్రణ లేకపోవడంవల్ల ఈ స్థలాలన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేక రోజురోజుకు అక్రమణ పెరిగిపోతూనే ఉంది. అందుకు ప్రధాన కారణం ట్రాఫిక్ వ్యవస్థపై ఎమ్మెమ్మార్డీయే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడమే. నగరంతోపాటు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా అక్కడక్కడ ఫ్లై ఓవర్లు, మెట్రో–2, 3, 4, 5 ప్రాజెక్టులున్నాయి. అథారిటీ అధికారులెవరు సొంత స్థలాలపై దృష్టి సారించడం లేదు. దీంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారు. అక్రమణలను తొలగించాలంటే ఎమ్మెమ్మార్డీయే చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. తమ స్థలాలు సొంతం చేసుకునేందుకు బలవంతంగా అక్రమణలు తొలగిస్తే కోర్టులు, స్టే ఆర్డర్లు, పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు, బాధితుల నుంచి దాడులు, ఆందోళనలు, రాస్తారోకోలు ఇలా అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేగాకుండా అక్రమణల కారణంగా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతోంది. ఆలస్యంగానైన కళ్లు తెరిచిన అథారిటీ ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించి కనీసం మిగిలిన స్థలాలను కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. చదవండి: ముంబైలో బైడెన్ బంధువులు..! -
ప్రైవేటు భద్రతా ఏజెన్సీ చట్టానికి మార్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు భద్రతా ఏజెన్సీల నియంత్రణా చట్టం-2005కు కొత్తమార్గదర్శకాలు విడుదల చేస్తూ బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు ప్రభుత్వం ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు, నగదు రవాణా నిబంధనలపై మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సిఫార్సులతో ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు, నగదు రవాణా నిబంధనలపై కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసి పలు సూచనలు చేసింది. నగదు తరలింపు చేసే ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు ప్రభుత్వం వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు భద్రతా ఏజెన్సీల నియామకానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కోంది. ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు రూ. 10 లక్షలకు మించి నగదు తరలిస్తే.. ఇద్దరు సాయుధ గార్డులు, నిర్దేశిత ప్రమాణాలతో కూడిన నగదు తరలింపు వాహనం ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాక నగదు తరలింపు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో 6 గంటల తర్వాత నగదు తరలించేందుకు వీల్లేదని ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలలోపు మాత్రమే నగదు తరలింపు చేపట్టాలని సూచించింది. -
సెక్యూరిటీ గార్డుల సంక్షేమానికి ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ముసాయిదా విధాన పత్రాన్ని రూపొందించింది. ‘ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ సెంట్రల్ (అమెండ్మెంట్) మోడల్ రూల్స్, 2019’ ముసాయిదాపై అభిప్రాయాలను, సూచనలను ఇవ్వాల్సిందిగా వ్యక్తులు, సంస్థలను కోరుతూ హోం శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 90 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు అంచనా. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు లైసెన్స్లిచ్చేందుకు ఇప్పటికే హోం శాఖ ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. లైసెన్సుల జారీకి ఆయా ఏజెన్సీల డైరెక్టర్లు, భాగస్వామ్యులు, యజమానుల వివరాలను వ్యక్తిగతంగా పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం లేదని కూడా గతంలో హోంశాఖ ప్రకటించింది. ముసాయిదా నిబంధనలను mha.gov.in/sites/default/files/private SecurityAgenies&06112019.pdf నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆ ప్రకటనలో హోంశాఖ పేర్కొంది. అభిప్రాయాలు, సూచనలను us&pm@nic.inMకు డిసెంబర్ 6 లోపు పంపించాలని కోరింది. -
‘సెక్యూరిటీ’ కోల్పోతున్న ఏజెన్సీలు!
♦ నోట్ల రద్దుతో 10% ఆదాయం డౌన్ ♦ ఇప్పుడు జీఎస్టీతో మరో ముప్పు ♦ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల ఆందోళన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో 10% ఆదాయం కోల్పోయిన ఏజెన్సీలకు ఇప్పుడు జీఎస్టీ రూపంలో మరో ముప్పు వచ్చి పడింది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సేవలు పొందే కంపెనీలు ఇప్పుడు 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఈ భారంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గార్డుల సంఖ్య కుదించాల్సిందిగా పలు కంపెనీలు, సంస్థల నుంచి ఏజెన్సీలకు సమాచారం వస్తోంది. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది వరకూ గార్డులకు కోత పడే అవకాశాలున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, ఎక్సెల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండీ సి.భాస్కర్ రెడ్డి బుధవారమిక్కడ చెప్పారు. ఇదే జరిగితే ఏజెన్సీల ఆదాయం మరింత తగ్గనుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వేల పైచిలుకు ఏజెన్సీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలపైనే..: పెద్ద నోట్ల రద్దుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీలు ఎక్కువగా నష్టపోయినట్లు భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా 50 లక్షల మంది గార్డులుండేవారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 4 లక్షలుండేది. పెద్ద నోట్లు రద్దయ్యాక ఏటీఎంలు భారీగా మూతపడటం, బ్యాంకుల వ్యయ నియంత్రణతో గార్డుల సంఖ్య దేశవ్యాప్తంగా 10%, తెలుగు రాష్ట్రాల్లో 15% తగ్గింది. ఆ మేరకు ఏజెన్సీలు ఆదాయం కోల్పోయాయి. క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీలకు కోలుకోలేని దెబ్బ పడింది. ఆర్మ్డ్ గార్డులకూ పనిలేకుండా పోయింది. ఇప్పుడు గార్డుల కనీస వేతనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.10 వేలకు అటూ ఇటూ ఉంది. గార్డుల్లో అత్యధికులు అస్సాం, ఒడిషా, బిహార్‌లకు చెందిన వారే. కర్ణాటకలో గార్డుల కనీస వేతనం ఇటీవలే రూ.15,000లకు చేరింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నవారు ఎక్కువ వేతనం వచ్చే ప్రాంతానికి వెళ్లడం ఖాయం. ఇలా అన్నివిధాలా ఇక్కడి ఏజెన్సీలు నష్టపోతున్నాయి’ అని వివరించారు. కొత్త ఏజెన్సీల జాడే లేదు..: సెక్యూరిటీ సేవల్లోకి గతంలో నెలకు 50 ఏజెన్సీల దాకా పుట్టుకు వచ్చేవి. డీమోనిటైజేషన్ దెబ్బకు కొత్తగా ఒక్కటీ రాలేదని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు కొత్తవారు భయపడుతున్నారని చెప్పారు. కాగా, సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్టు కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకున్న కంపెనీలు, సంస్థలపై జూన్ 30 వరకు సర్వీస్ ట్యాక్స్ 15 శాతం ఉండేది. ఇప్పుడిది 18 శాతానికి చేరింది. అయితే స్థూల వేతనంపైన కాకుండా సెక్యూరిటీ ఏజెన్సీలు వసూలు చేసే సర్వీస్ చార్జ్పైన జీఎస్టీ విధించాలని అసోసియేషన్ ట్రెజరర్, ట్రాన్స్పరెంట్ కార్పొరేట్ సర్వీసెస్ మేనేజింగ్ పార్ట్నర్ ఎన్.వి.సత్యానందం తెలిపారు.