సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు భద్రతా ఏజెన్సీల నియంత్రణా చట్టం-2005కు కొత్తమార్గదర్శకాలు విడుదల చేస్తూ బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు ప్రభుత్వం ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు, నగదు రవాణా నిబంధనలపై మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సిఫార్సులతో ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు, నగదు రవాణా నిబంధనలపై కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసి పలు సూచనలు చేసింది. నగదు తరలింపు చేసే ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు ప్రభుత్వం వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు భద్రతా ఏజెన్సీల నియామకానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కోంది. ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు రూ. 10 లక్షలకు మించి నగదు తరలిస్తే.. ఇద్దరు సాయుధ గార్డులు, నిర్దేశిత ప్రమాణాలతో కూడిన నగదు తరలింపు వాహనం ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాక నగదు తరలింపు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది.
పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో 6 గంటల తర్వాత నగదు తరలించేందుకు వీల్లేదని ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలలోపు మాత్రమే నగదు తరలింపు చేపట్టాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment