ప్రోత్సాహమిస్తే ప్లాంటు పెడతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పురుగు మందుల తయారీ, మార్కెటింగ్ రంగంలో ఉన్న స్వాల్ కార్పొరేషన్ దక్షిణాదిన మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల టర్నోవరు ఆశిస్తున్న కంపెనీకి ఆంధ్రప్రదేశ్ నుంచి మూడింట ఒకవంతు ఆదాయం సమకూరుతోంది. ఆదాయ పరంగా ప్రాముఖ్యమున్నందునే ప్రతిపాదిత ప్లాంటును ఈ ప్రాంతంలోనే నెలకొల్పుతామని స్వాల్ కార్పొరేషన్ ఇండియా బిజినెస్ హెడ్ విజయకుమార్ భట్ తెలిపారు.
మూడు కొత్త ఉత్పత్తులను ఆదివారమిక్కడ ఆవిష్కరించిన అనంతరం మార్కెటింగ్ డీజీఎం సి.శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలనుబట్టి ప్లాంటు ఎక్కడ స్థాపించేది నిర్ణయిస్తామన్నారు. ప్లాంట్ల సామర్థ్యం ప్రస్తుతం సరిపోతుందని, మూడేళ్లలో విస్తరణకు వెళ్తామని పేర్కొన్నారు. యూపీఎల్ లిమిటెడ్ అనుబంధ కంపెనీయే స్వాల్ కార్పొరేషన్(గతంలో షావాలెస్ అగ్రో కెమికల్స్). స్వాల్ 2014-15లో రూ.650 కోట్ల టర్నోవరు అంచనా వేస్తోంది.
మరిన్నిపేటెంట్లు.. పనామా, స్వచ్ఛ్, పటేలా పేర్లతో పురుగు మందులను స్వాల్ కార్పొరేషన్ ఆవిష్కరించింది. రసం పీల్చు పురుగుల నుండి 15-20 రోజుల పాటు మొక్కలకు పనామా రక్షణ కల్పిస్తుందని విజయకుమార్ తెలిపారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం, నూత న మాలిక్యూల్‌తో దీనిని అభివృద్ధి చేశామన్నారు. కలుపు మొక్కల నివారణకోసం తయారు చేసిన స్వచ్ఛ్, పటేలా మందులకు పేటెంటు ఉందని చెప్పారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో 57 రకాల ఉత్పత్తులను అందిస్తున్నట్టు తెలిపారు. వీటిలో మూడు ఉత్పత్తులకు పేటెంటు ఉంది. మూడేళ్లలో పేటెంటు కలిగిన ఉత్పత్తుల సంఖ్య 10కి చేరుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. వ్యవసాయ రసాయనాల మార్కెట్ పరిమాణం భారత్‌లో ప్రస్తుతం రూ. 12,000 కోట్లుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 2,000 కోట్లు.