సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను రెండు ముక్కలు చేయనున్నారు. ఒక భాగం తెలంగాణ రాష్ట్రానికి, మరో భాగం సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి కేటాయించనున్నారు. రాష్ట్ర విభజన, ఆస్తుల పంపిణీలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర పనర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీలోని ఏపీ భవన్‌ను జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉందని.. అపాయింటెడ్ డే కన్నా ముందుగానే భవన నిర్మాణ స్థలం ఖాళీగా ఉన్న స్థలం లెక్కించి పంపిణీకి సిద్ధం చేయాలని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు.
కర్నూలు, వరంగల్‌లలో గ్రేహౌండ్స్ కేంద్రాలు
మావోయిస్టు కార్యకలాపాలను అదుపు చేసేం దుకు కర్నూలు, వరంగల్‌లలో కొత్తగా గ్రేహౌండ్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్ కమిటీ సిఫారసు చేసిందని, ఇందుకు అనుగుణంగా ఆర్థిక సహాయానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని సీఎస్ ఆదేశించారు.
నిరుపయోగ సంస్థల మూసివేత
రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నిరుపయోగమైన ప్రభుత్వ రంగ సంస్థలు, అవసరం లేని శాఖలు, సొసైటీలు, ఏజెన్సీలను గుర్తించి మూసివేయాలని, అలాగే మరికొన్ని సంస్థలను వేరే సంస్థల్లో విలీనం చేయాలని సీఎస్ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ భవన్ రెండు ముక్కలు
Published Mon, Mar 3 2014 3:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement