రికార్డ్ స్థాయిలకు సెన్సెక్స్, నిఫ్టీలు
- 30,025 రికార్డు తర్వాత 213 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 9,100 తాకిన అనంతరం నిఫ్టీకి 74 పాయింట్ల నష్టం
- గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణం
- మార్కెట్ అప్ డేట్
నాలుగు రోజుల స్టాక్ మార్కెట్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. ఎవరూ ఊహించని రీతిలో మరోసారి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించింది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.
సెన్సెక్స్ తొలిసారిగా 30,000 శిఖరాన్ని చేరింది. నిఫ్టీ 9,100 పాయింట్లను దాటాయి. ఆశ్చర్యకరంగా రెపోరేటును ఆర్‌బీఐ కోత కోయడంతో సెన్సెక్స్ ఆల్‌టైమ్ హై-30,025ను, నిఫ్టీ రికార్డ్ గరిష్ట స్థాయి 9,119లను తాకాయి. అయితే ఈ ఉత్సాహం కొద్దిసేపే ఉంది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా లాభపడడంలో విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో చివరకు సెన్సెక్స్ 213 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 74 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. కాగా ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించడం రెండు నెలల్లో ఇది రెండోసారి.
మొత్తం నష్టం 644 పాయింట్లు: మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. దీంతో గ్యాపప్‌తో స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభయ్యాయి. కొన్ని నిమిషాల్లోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 30,025 పాయింట్లను తాకింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 29,289 కనిష్ట స్థాయికి క్షీణించింది. చివరకు 213 పాయింట్ల (0.72 శాతం)నష్టంతో 29,381 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డే గరిష్ట స్థాయి నుంచి చూస్తే 644 పాయింట్లు నష్టపోయింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(0.82 %) నష్టపోయి 8,923 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్, లోహ, ఆయిల్, గ్యాస్, విద్యుత్, వాహన, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియల్టీ షేర్లు పెరిగాయి.
ఆందోళన అనవసరం: గత నాలుగు రోజులగా స్టాక్ మార్కెట్ దూసుకుపోతూనే ఉందని, బుధవారం స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డ్ స్థాయిలకు చేరడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని నిపుణులంటున్నారు. అయితే ఈ క్షీణత సాధారణమైనదేనని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డ్ స్థాయిలకు చేరడంతో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగిందని, ఆందోళన చెందాల్సినదేమీ లేదని వారంటున్నారు. ఏప్రిల్‌లో జరిగే ద్రవ్య పరపతి సమీక్షకు ముందే రెపో రేటును తగ్గించడం-మధ్యకాలానికి ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వ కృతనిశ్చయాన్ని వెల్లడిస్తోందని, దీంతో స్టాక్ మార్కెట్ సంతృప్తిపడిందని ప్రభుదాస్ లీలాధర్ హెడ్(ఇన్వెస్ట్‌మెంట్) అజయ్ బోడ్కే చెప్పారు.
వెలుగులో సన్ ఫార్మా, స్పార్క్‌లు: సన్ ఫార్మా అనుబంధ సంస్థ సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కంపెనీ(స్పార్క్) రూపొందించిన మూర్ఛ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది. దీంతో సన్ ఫార్మా 6.7%లాభంతో రూ.1,006వద్ద, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కంపెనీ 4.4 శాతం లాభంతో రూ. 430 వద్ద ముగిశాయి. సన్‌ఫార్మాలో విలీనం కానున్న ర్యాన్‌బాక్సీ కూడా ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి(రూ.803)ని తాకి 7 శాతం లాభంతో రూ.783 వద్ద ముగిసింది.
లాభ నష్టాల్లో....: 30 సెన్సెక్స్ షేర్లలో 24 నష్టాల్లో, 6 లాభాల్లో ముగిశాయి. 1,887 షేర్లు నష్టాల్లో, 1,003 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.6,861 కోట్లు.
సెన్సెక్స్ 30,000..చివరికి నష్టాల్లోకి
Published Thu, Mar 5 2015 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement
Advertisement