చౌక ధరల్లో ఔషధాలు అందించాలి..
రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్
న్యూఢిల్లీ: ప్రజలకు నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరల్లో అందించాలని భారత ఫార్మా కంపెనీలకు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ సూచించారు. ఫార్మా రంగంలో విధానాలను, నిబంధనాలను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడి రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. బల్క్‌డ్రగ్‌ల దిగుమతులపై చైనాపై అధికంగా ఆధారపడుతున్నామని, ప్రభుత్వం దీనికి పరిష్కారం అన్వేషిస్తుందని పేర్కొన్నారు.
దేశీయంగా బల్క్‌డ్రగ్‌ల ఉత్పత్తిని చేపట్టే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా బల్క్‌డ్రగ్‌ల ఉత్పత్తికి అనువైన వాతావరణాన్ని భారత్ సృష్టించుకోవలసిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీ వి.కె. సుబ్బురాజ్ చెప్పారు.ఆర్‌ఐఎస్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. మన దేశంలో ఫార్మా రంగం మంచి వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు.
కానీ బల్క్‌డ్రగ్స్, మెడికల్ పరికరాల కోసం దిగుమతులపైననే అధికంగా ఆధారపడుతున్నామని చెప్పారు. బల్క్‌డ్రగ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) కార్యకలాపాలు నిర్వహిస్తోందని వివరించారు.