
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నింటికీ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేసి పంపిణీ చేయగల సత్తా భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా టీకాకు సంబంధించి భారత్‌లో ఎన్నో కీలక ఘట్టాలు పూర్తయ్యాయని, టీకా డోసుల్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సత్తా ఫార్మా ఇండస్ట్రీకి ఉందని ఆయన కొనియాడారు. ‘కోవిడ్–19: వైరస్‌పై భారత్ యుద్ధం’పేరుతో గురువారం డిస్కవరీ ప్లస్ చానల్‌లో ప్రసారమైన డాక్యుమెంటరీలో గేట్స్ మాట్లాడారు.
అతి పెద్ద దేశం, కిక్కిరిసిన జనాభా, పట్టణాల్లో జనసాంద్రత వంటి అంశాల వల్ల కరోనా వైరస్‌తో భారత్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందన్నారు. టీకాల తయారీలో భారత్‌కు మించిన దేశం లేదన్నారు. సీరం వంటి అతి పెద్ద సంస్థలు సహా ఎన్నో ఫార్మా కంపెనీల సహకారంతో ప్రపంచ దేశాలకు టీకాలను పంపిణీ చేయగలదని గేట్స్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. వివిధ రకాల పరిశోధనలకు సహకారం అందిస్తూనే యూపీ, బిహార్‌లలో ఆరోగ్య రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని గేట్స్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment