టయోటా కార్ల రేట్లు పెంపు
రూ. 13 వేల నుంచి రూ. 1.6 లక్షల దాకా పెరుగుదల
న్యూఢిల్లీ: జీఎస్‌టీకి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం దృష్ట్యా తమ కార్లలో నిర్దిష్ట మోడల్స్ తాలూకు రేట్లను రూ.13,000 నుంచి రూ. 1.6 లక్షల దాకా పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) వెల్లడించింది. జీఎస్‌టీ కౌన్సిల్ మధ్య స్థాయి, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్సును 2–7 శాతం మేర పెంచిన దరిమిలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నోవా క్రిస్టా ధర సుమారు రూ. 78,000, కరోలా ఆల్టిస్ రేటు రూ. 72,000, ఎతియోస్ ప్లాటినం ధర రూ. 13,000, ఫార్చూనర్ రూ. 1.6 లక్షల మేర పెంచినట్లు టీకేఎం డైరెక్టర్ ఎన్ రాజా తెలిపారు. చిన్న, హైబ్రీడ్ కార్ల ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సెస్సును పెంచడంతో మధ్య స్థాయి కార్లపై జీఎస్‌టీ రేటు మొత్తం మీద 45 శాతానికి, పెద్ద కార్లపై 48 శాతానికి, ఎస్‌యూవీలపై 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.