3జీ స్పెక్ట్రం... బేస్ ధర రూ. 2,720 కోట్లు
కేంద్రానికి ట్రాయ్ సిఫార్సులు
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా దేశవ్యాప్త 3జీ స్పెక్ట్రం వేలం ధరను ప్రతి మెగాహెట్జ్‌కి రూ. 2,720 కోట్లుగా నిర్ణయించాలని టెలికం విభాగానికి (డాట్) సిఫార్సు చేసింది. 2010లో మొబైల్ ఆపరేటర్లు చెల్లించిన మొత్తానికన్నా ఇది 19 శాతం తక్కువ. అయితే, క్రితం 3జీ వేలం రిజర్వ్ ధరతో పోలిస్తే మాత్రం నాలుగు రెట్లు అధికం. మరోవైపు, 1900 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రంకి బదులుగా రక్షణ శాఖ నుంచి అదనంగా లభించబోయే 15 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కూడా వేలం వేయాల్సిందిగా ట్రాయ్ సూచించింది. రక్షణ శాఖతో సూత్రప్రాయ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇది తక్షణమే చేతికి రాకపోయినప్పటికీ వేలం వేసేయొచ్చని పేర్కొంది. ప్రతి లెసైన్సు సర్వీస్ ఏరియాలో (ఎల్‌ఎస్‌ఏ) 2,100 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ (3జీ) స్పెక్ట్రం బేస్ ధర రూ. 2,720 కోట్లుగా నిర్ణయించాలని పేర్కొంది.
ఎల్‌ఎస్‌ఏలో 3-4 బ్లాకులు ఉన్న పక్షంలో ఏ బిడ్డరు కూడా 2 బ్లాకులకు మించి బిడ్డింగ్ వేయకుండా పరిమితి విధించాలని తెలిపింది. వేలంలో విజేతలుగా నిల్చిన టెలికం ఆపరేటర్లు ..స్పెక్ట్రం కేటాయింపులు జరిపినప్పట్నుంచీ మూడేళ్లలోగా నెట్‌వర్క్‌ను సన్నద్ధం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. గతంలో ఇది అయిదేళ్లుగా ఉండేది. అటు ఎస్-టెల్‌కు మూడు సర్వీస్ ఏరియాల్లో (బీహార్, ఒడిషా, హిమాచల్ ప్రదేశ్) కేటాయించిన స్పెక్ట్రంను కూడా వేలం వేయాలని ట్రాయ్ సూచించింది.
2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో సుప్రీం కోర్టు 122 లెసైన్సులు రద్దు చేయడంతో ఎస్‌టెల్ భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిలిపివేసింది. 800,900, 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లలో ఫిబ్రవరిలో స్పెక్ట్రం వేలం జరగనున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు 2,100 మెగాహెట్జ్ బ్యాండ్ విడ్త్ స్పెక్ట్రం కూడా వేలం వేయాలని డాట్ యోచిస్తోంది. ట్రాయ్ సిఫార్సులను డాట్.. టెలికం కమిషన్‌కు సమర్పిస్తుంది. అది.. టెలికం శాఖకు అభిప్రాయం తెలియజేస్తుంది. మరోవైపు, ట్రాయ్ సిఫార్సులు సరైన దిశలో ఉన్నాయని టెలికం సంస్థ యూనినార్ అభిప్రాయపడింది.