
ట్రయల్ రూం మీ స్మార్ట్‌ఫోన్లో..!
♦ 3డీ బాడీ మ్యాపింగ్‌తో సాధ్యం
♦ అందుబాటులోకి తెచ్చిన ట్రూపిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో నచ్చిన బ్రాండ్ దుస్తులు కొంటున్నారా? ఇంతకీ ఆ దుస్తులు మీకు ఎలా ఫిట్ అవుతాయో వేసుకుంటేగానీ తెలియదు. ప్రత్యక్షంగా వేసుకోకున్నా అవి ఎలా ఫిట్ అవుతాయో స్మార్ట్‌ఫోన్‌లో చూపించే వ్యవస్థను ట్రూపిక్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ట్రూపిక్‌తో చేతులు కలిపిన ఏదైనా బ్రాండ్ స్టోర్‌కు కస్టమర్ ఒకసారి వెళ్లి పేరు నమోదు చేసుకుంటే చాలు. స్టోర్‌లో అత్యాధునిక 3డీ మ్యాపింగ్ విధానంలో 360 డిగ్రీల కోణంలో కస్టమర్‌ను చిత్రిస్తారు. తద్వారా 3డీ డిజిటల్ వ్యక్తిని సృష్టిస్తారు. ఇక కస్టమర్ తాను ఎక్కడున్నా ట్రూపిక్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై తనకు నచ్చిన డ్రెస్‌ను క్లిక్ చేయగానే డిజిటల్ వ్యక్తి ప్రత్యక్షంగా ఆ దుస్తులను వేసుకున్నట్టు కనపడుతుంది. అన్ని వైపుల నుంచి ఆ డ్రెస్ ఎలా ఫిట్ అయిందో చూడొచ్చు. ఫేస్‌బుక్ వేదికగా స్నేహితుల నుంచి సలహాలూ కోరవచ్చు. నచ్చితే ఆర్డరు చేయొచ్చు.
సౌకర్యంగా ఉంటుంది...
ఆర్డరు చేయగానే దగ్గరలోని బ్రాండ్ స్టోర్ ప్రతినిధి కస్టమర్‌కు దుస్తులను డెలివరీ చేసి వెళ్తారు. డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించాలి. ‘సాధారణంగా షాపింగ్‌కు గంటల తరబడి సమయం వెచ్చించాలి. ఆన్‌లైన్‌లో కొన్నట్టయితే సైజు తేడా వచ్చే సమస్యలున్నాయి. ట్రూపిక్‌లో అయితే అటువంటి సమస్యలేవీ లేవు’ అని సీఈవో శ్రీధర్ తిరుమల శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రేమండ్, ఇండియన్ టెరైన్, అలెన్ సాలీ, విల్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్‌తో చేతులు కలిపామన్నారు. మరో 11 బ్రాండ్లు త్వరలో చేరనున్నాయని చెప్పారు.