చాటింగ్.. చీటింగ్!
- బలవుతున్న యువతీయువకులు
- పోలీసు స్టేషన్లలో పంచాయితీలు
–అపరిచిత ఫొటోలు, కాల్స్‌కు దూరంగా ఉండడమే మేలంటున్న నిపుణులు
తిరుపతి క్రైం : ఎవరిచేతిలో చూసిన స్మార్ట్‌ఫోన్.. చవకగా దొరుకుతున్న ఇంటర్‌నెట్.. కాసేపు చాటింగ్ చేయకుంటే నిద్రపట్టని పరిస్థితి. బస్సు ఫుట్‌బోర్డుపై వెలాడుతూ కూడా చాటింగ్ చేస్తున్నారు. అవతల వారు ఎవరో కూడా తెలియకుండా చాటింగ్ చేస్తూ బుట్టలో పడుతున్నారు. ఇందుకు నిదర్శనం తిరుపతిలో జరిగిన రెండు సంఘటనలు . అవేవో చూద్దాం..
– ఇటీవల తిరుపతి నగరంలో ఓ యువకుడు మహిళ వలలో పడ్డాడు. ఫేస్‌బుక్‌లో ఇతరుల ఫొటో పెట్టి యువతి ఆ యువకుడికి ఫ్రెండ్ రిక్విస్ట్ పెట్టింది. యువకుడు ఫొటోను చూసి ఆకర్షితుడయ్యాడు. చాటింగ్ చేశాడు. తియ్యని మాటలకు కరిగిపోయాడు. ఇరువురూ చాటింగ్‌లో వేరే ఊరులో కలుద్దామనుకున్నారు. ఆ ఊరిలో ఆ యువతిని చూడగానే షాక్ అయ్యాడు. అప్పటి నుంచి ఆ యువతి బ్లాక్ మెయిల్ చేస్తోంది. తనకు నగదు ఇవ్వాలని, ఇవ్వకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డుపై నిలబెడుతానని బెదిరించడం ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా తిరిగి ఆ యువతితో బేరసరాలకు పోయి పోలీసుల సమక్షంలో పంచాయితీ జరిగింది.
– మదనపల్లికి చెందిన ఓ యువతి వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఫోన్‌చాటింగ్‌లో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. ఆమె ఉద్యోగస్తురాలు కావడంతో తరచూ ఆ యువకుడు ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లేవాడు. తిరిగి అవసరాల మేరకు డబ్బులు తెచ్చుకునేవాడు. ప్రేమించిన వ్యక్తి కావడంతో అడిగినంత డబ్బు ఇచ్చేది. నాలుగు లక్షలు దాకా నగదు ఇచ్చింది. అనంతరం ఆ యువకుడు యువతికి దూరమయ్యాడు. ఫోన్ టచ్‌లో కూడా లేకుండా పోయాడు. ఆ యువతి యువకుడి కోసం ఆరా తీసింది. యువకుడు అదే జిల్లాకు చెందిన యువతితో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుసుకుంది. చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది. యువతీయువకులు అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను వదిలించుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుందని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు.