నిందితుడి అరెస్ట్ వివరాలను తెలుపుతున్న ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్. సుధాకర్
సాక్షి, కడప అర్బన్: కడప నగరానికి చెందిన ఎస్సీ యువతికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై మోసం చేసిన కేసులో పులివెందుల మండలానికి చెందిన రూప్‌సాగర్‌ను ఎస్సీ, ఎస్టీసెల్ డీఎస్పీ ఎన్. సుధాకర్ శుక్రవారం తమ సిబ్బందితో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను తెలియజేశారు. కడప నగరానికి చెందిన ఎస్సీ యువతికి, ఫేస్‌బుక్ ద్వారా పులివెందులకు చెందిన రూప్‌సాగర్ పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించి యువతిని శారీరకంగా అనుభవించి తరువాత ముఖం చాటేశాడు.
సదరు యువతి, యువకుని ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోమని బతిమలాడగా ఆ అమ్మాయిని కులం పేరుతో తిట్టిన యువకుడు, తాను ఇదివరకే వేరే అమ్మాయితో వివాహం చేసుకున్నానని చెప్పాడు. దీంతో సదరు యువతి తనకు జరిగిన అవమానభారం భరించలేక చనిపోవాలనే ఉద్దేశంతో చేయి కోసుకుని, వాస్మోల్ సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. తరువాత ఆసుపత్రి పాలైంది. ఈ సంఘటనపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆ కేసును ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీకి అప్పగించారన్నారు. కేసులో విచారణ జరిపి నిజనిర్ధారణ చేసి, రూప్ సాగర్‌ను అరెస్ట్ చేశామన్నారు పులివెందుల కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా, ఆగస్టు 2 వరకు నిందితుడికి రిమాండ్ విధించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment