హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబర్ ఇప్పుడు భారత్‌లో భారీగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా రెస్పాన్స్, సపోర్ట్ ఫెసిలిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇందుకు వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.317 కోట్లను వెచ్చించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఫెసిలిటీలో 500 మంది సిబ్బంది పనిచేసే వీలుందని ఉబర్ హైదరాబాద్ జీఎం సిద్ధార్థ్ శంకర్ తెలిపారు. ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్‌తో (టాస్క్) కూడా చేతులు కలుపుతున్నాం. 2016 చివరినాటికి 2,000 మందికి టాస్క్ శిక్షణ ఇస్తుంది.
విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వారికి రుణం అందేలా తోడ్పాటు అందించి, వాహనాలను సమకూరుస్తాం’ అని తెలిపారు. ఇక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగానూ హైదరాబాద్ ఫెసిలిటీని ఉబర్ ఉపయోగించుకోనుంది. యూఎస్ తర్వాత కంపెనీకి భారత్ రెండవ అతిపెద్ద మార్కెట్ . ఇటీవలే కంపెనీ వైజాగ్‌తోసహా ఏడు నగరాల్లో అడుగుపెట్టింది. దీంతో కంపెనీ సేవలందిస్తున్న నగరాల సంఖ్య భారత్‌లో 18కి చేరుకుంది.
హైదరాబాద్‌లో ఉబర్ కేంద్రం..
Published Thu, Jul 9 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement