ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన రాత్రి
జూన్ 25, 1975 రాత్రి: 1, సఫ్దర్ జంగ్ రోడ్డు, న్యూఢిల్లీ, దేశ ప్రధాని ఇందిరాగాంధీ నివాసం. కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ్ శంకర్ రేతో సీరియస్‌గా ముచ్చటిస్తున్నారు ఇందిరాజీ. ఆ రోజు సాయంత్రం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల అగ్ర నాయకులు అటల్ బిహారీ వాజ్‌పేయి, మొరార్జీ దేశాయి, చంద్రశేఖర్ ఒకే వేదికపై నుండి, అలహాబాదు హైకోర్టు జడ్జిమెంట్‌ను ప్రస్తావించి ఇందిరాజీని ప్రధాని పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఇందిర ఈ విషయంపైనే చర్చిస్తున్నారు.
ఇంతకూ అలహాబాద్ కోర్టు తీర్పేమిటో చూద్దాం. 1975 జూన్ 12 నాడు ఇందిరాగాంధీ నిలిచి గెలిచిన రాయబరేలి లోక్‌సభ ఎన్నిక (1971) చెల్లదనీ, ఆరేళ్లు ఆమె ఎన్నికల్లో పోటీచేయరాదనీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడంతో, పాక్షిక ఉపశమనంగా జస్టిస్ కృష్ణయ్యర్, ఆమెను తాత్కాలికంగా ప్రధాని పదవిలో కొనసాగిస్తూ, పార్లమెంటులో ఓటు హక్కును మాత్రం వినియోగించుకోరాదని స్టే ఆర్డర్ ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగ జారుతున్న రోజులవి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటివి పెరిగి పోతున్నాయి.
‘ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకు నేను రాజీనామా చేసి, దేవకాంత్ బరూవాను కొంతకాలం మధ్యంతర ప్రధానిగా నామినేట్ చేయాలనుకుంటున్నాను’ అని మనసులోని మాటను సిద్ధార్థ్ శంకర్ రేతో బహిర్గతం చేశారు మేడం గాంధీ. ఆమె అనటమే తడవు, ‘నో మమ్మీ! నువ్వు రాజీనామా చేసే ప్రసక్తే లేదు’ అన్నారు ప్రధాని చిన్న కుమారుడు 29 ఏళ్ల సంజయ్.
సిద్ధార్థ బాబుతో, ‘రాజ్యాంగం దృష్ట్యా దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి’ అన్నారు సంజయ్. ‘ఇప్పటి దేశ సమస్యల రీత్యా మనం రాజ్యాంగంలో ఆర్టికల్ 352ను అనుసరించి ‘అంతర్గత ఆత్యయిక పరిస్థితి’ (ఇంటర్నల్ ఎమర్జెన్సీ) విధించవచ్చనీ, దీనికి క్యాబినెట్ సమ్మతి, ఆ తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్సు అవసరం అనీ, ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందనీ లీగల్ సలహా ఇచ్చారు రే.
‘మరేం ఫర్లేదు, క్యాబినెట్ ఆమోదం రేపు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రాత్రికి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రక్రియ మాత్రం పూర్తి చేద్దాం’ అన్నారు సంజయ్. ప్రధాని చేతి
లోని పరిపాలనా పగ్గాలు అనధికారికంగా, అనుకోకుండానే అలా సంజయ్ చేతి లోకి వెళ్లాయి. హుటాహుటిన పర్సనల్ స్టాఫ్‌తో ఒక తెల్ల కాగితం మీద డ్రాఫ్ట్ టైప్
చేయించారు శంకర్ రే.
‘ప్రస్తుతం దేశం అంతర్గత అల్లర్ల దరిమిలా శాంతి భద్రత లకు తీవ్ర అపాయం వాటిల్లు తున్నందులకు రాజ్యాంగం ఆర్టి కల్ 352(1)ని అనుసరించి అత్యవసర పరిస్థితి విధించడం అనివార్యం. దీనితో జత పరచిన ఆర్డినెన్సుపై మీ సంతకం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు సమయం లేనందున, బిజినెస్ రూల్స్, 1961 ప్రకారం, రేపు ఉదయమే ఈ విషయం క్యాబినెట్ కమిటీలో చర్చించి, మంత్రివర్గ సమ్మతి మీకు అంద జేస్తా’మని ఆ లెటరులో రాసి, ప్రధాని ఇందిర సంతకం చేయించారు రే.
ఆయనే స్వయంగా ఆ లేఖ తీసుకొని రాష్ట్రపతి భవన్‌కు చేరుకునేటప్పటికి రాత్రి 11 దాటింది. అప్పటికి గాఢనిద్రలో ఉన్న రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్‌ను అర్జంట్ పని అని చెప్పి నిద్ర లేపమని సిబ్బందిని కోరారు. పది నిమిషాల తర్వాత నైట్ గౌనులో ప్రెసిడెంట్ హాలులోకి రావడంతో తను వచ్చిన విషయం వివరించారు రే. వెంట తెచ్చిన ప్రధాని ఉత్తరం, ప్రొక్లమేషన్ కాపీ ఆయనకు అందించారు.
అనిష్టంగానే ప్రొక్లమేషన్ కాపీపై సంతకం చేసి రాష్ట్రపతి సీల్ ముద్ర వేశారు. ఆ రాత్రి ప్రధాని కార్యాలయంలోని సిబ్బంది... సంజయ్ గాంధీ, సిద్ధార్థ్ శంకర్ రే పర్యవేక్షణలో చకచకా పనుల్లో మునిగి పోయారు. మొట్ట మొదట న్యూఢిల్లీలోని జాతీయ పత్రికల కార్యాలయాల్లో కరెంటు కట్ జేశారు. మరుసటి రోజు రావలసిన వార్తా పత్రికల ముద్రణ ఆగిపోయింది.
పలు రాష్ట్రాల్లోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు ప్రముఖ ప్రతిపక్ష నాయకులను వెంటనే కస్టడీలోకి తీసుకోవలసిందిగా ఆర్డర్లు జారీ అయ్యాయి. జయప్రకాశ్ నారాయణ్, చరణ్ సింగ్, వాజ్‌పేయి, అడ్వాణీలను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. తెల్లవారటంతోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్జీవన్ రామ్, వైబీ చవాన్, స్వరణ్ సింగ్, బ్రహ్మానంద రెడ్డి ఇళ్ళ ఆవరణలో సీఐడీ అధికారులను నియమించి, అటు వస్తూ వెళ్ళే ఆగంతకులపై ఒక ‘నజర్’ ఉంచాల్సిందిగా ఆర్డర్లు వెళ్లాయి.
26 జూన్, ఉదయం 10 గంటలకు ప్రధాని నివాసంలో క్యాబినెట్ కమిటీ మీటింగు ఏర్పాటు చేశారు. ఇందిర తన ప్రసంగంలో దేశం ఎదుర్కొంటున్న విషమ పరిస్థితులను వివరిస్తూ, ప్రతిపక్ష నాయకులు... ప్రభుత్వాన్నీ, పోలీసు వ్యవస్థనూ, ప్రజలనూ పెడతోవ పట్టిస్తున్న విషయాలు వివరించి, దీనికి ఉపశమనంగా కొంతకాలం అత్యవసర పరిస్థితి అవసరమని చెప్పారు.
గత రాత్రి నుండే పరిస్థితులు అనూన్యంగా మారిన విషయం క్యాబినెట్ మంత్రులకు అవగతమవటంతో, భయాందోళన రీత్యా, ప్రధానికి వ్యతిరేకంగా రేకెత్తుతున్న కొన్ని గళాలు నాటకీయంగా మూగవోయి ఆమె చర్యకు పూర్తి మద్దతు తెలిపాయి. ఏకగ్రీవంగా అత్యవసర పరస్థితికి మద్దతు తెలిపి తయారు చేసిన రిజల్యూ షన్ రాష్ట్రపతికి పంపింది క్యాబినెట్ కమిటీ. కేవలం 90 నిమిషాల పాటు జరిగిన ఆ క్యాబినెట్ మీటింగ్ ద్వారా, రాజ్యాంగం ప్రజలకందించిన ప్రజాసామ్య హక్కులు వారి నుండి 18 జనవరి, 1977 వరకు హరించబడ్డాయి.
జిల్లా గోవర్ధన్
వ్యాసకర్త మాజీ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ‘ 98190 96949
(ప్రణబ్ ముఖర్జీ ‘ద డ్రమెటిక్ డికేడ్’, కుల్దీప్ నయ్యర్ ‘బియాండ్ ద లైన్స్’ ఆధారంగా)