
అమ్మకానికి టాటా స్టీల్ యూరప్ యూనిట్...
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ యూకే (టీఎస్‌యూకే) యూరప్‌లోని తమ లాంగ్ ప్రోడక్ట్స్ వ్యాపార విభాగాన్ని విక్రయించనుంది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌లో భాగంగా టీఎస్‌యూకేకి చెందిన స్కన్‌థోర్ప్ స్టీల్ వర్క్స్, వర్కింగ్‌టన్‌లోని ఇంజనీరింగ్ వర్క్‌షాప్ మొదలైనవి విక్రయించనుంది.
ఉక్కు పరిశ్రమ ప్రస్తుతం అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటోందని, లాంగ్ ప్రోడక్ట్స్ యూరప్ వ్యాపార విభాగానికి ఊపిర్లూదేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని టాటా స్టీల్ యూరప్ వ్యాపార సీఈవో కార్ల్ కోహ్లర్ తెలిపారు. లాంగ్ ప్రోడక్ట్స్ యూరప్ వ్యాపారం కింద టీఎస్‌యూకే .. నిర్మాణం తదితర రంగాల్లో ఉపయోగపడే వైర్ రాడ్లు, సెమీ ఫినిష్డ్ స్టీల్ మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సుమారు 4,700 మంది పైగా సిబ్బంది ఉన్నారు.