టాటా మిస్త్రీతో బ్రిటన్ వాణిజ్య మంత్రి సమావేశం
ముంబై: బ్రిటన్ వాణిజ్య మంత్రి సాజిద్ జావీద్, టాటా గ్రూప్ చీఫ్ సైరస్ మిస్త్రీతో బుధవారం ముంబైలో రెండు గంటల పాటు సమావేశం జరిపారు. టాటా స్టీల్ ఇంగ్లాండ్ కార్యకలాపాల విక్రయంపై చర్చలు జరిగాయి. ఇక్కడి బాంబే హౌస్‌లో మిస్త్రీ, ఇతర ఉన్నతాధికారులతో జావీద్ చర్చలు జరిపారు. భారీగా నష్టాలు వస్తుండటంతో ఇంగ్లాండ్ కార్యకలాపాలను విక్రయించాలని టాటా స్టీల్ నిర్ణయించడం తెలిసిందే. ఈ ప్లాంట్ల కొనుగోలుకు తగిన కంపెనీని ఎంచుకోవడం, వేలాది కార్మికులు వీధినపడకుండా చూడడం ప్రధానాంశాలుగా ఈ చర్చలు జరిగాయి.
అయితే చర్చల వివరాలను టాటా గ్రూప్‌గానీ, జావీద్ గానీ వెల్లడించలేదు. జావీద్ టాటా స్టీల్ గ్రూప్ ఈడీ కౌశిక్ చటర్జీని కూడా కలిశారు. ఎలాంటి ఉద్యోగాల కోత ఉండకుండా చూడాలని టాటా కంపెనీపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. భారత్‌కు వచ్చే ముందు లిబర్టీ గ్రూప్‌కు చెందిన సంజీవ్ గుప్తాతో జావీద్ చర్చలు జరిపారు. సౌత్‌వేల్స్‌లోని టాటా స్టీల్‌కు చెందిన పోర్ట్‌తాల్‌బోట్‌ప్లాంట్‌ను కొనుగోలు చేయాలని సంజీవ్ గుప్తా యోచిస్తున్నారు.